గులాబీ పార్టీకి బిగ్‌ షాక్‌..

టిఆర్ఎస్ పార్టీ కి బిగ్ షాక్ తగిలింది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గంలో బడంగ్‌పేట్ మేయర్ చిగిరింత పారిజాత నర్సింహారెడ్డి పార్టీకి రాజీనామా చేశారు. ఈ మేరకు ఆదివారం ఆమె తన రాజీనామా లేఖను జిల్లా అధ్యక్షుడు మంచిరెడ్డి కిషన్ రెడ్డికి పంపించారు.

ఈ సందర్భంగా తన రాజీనామా లేఖలో గులాబీ పార్టీకి, క్రియాశీల సభ్యత్వానికి రాజీనామా చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో కొన్ని అనివార్య, వ్యక్తిగత కారణాల వల్లే పార్టీకి రాజీనామా చేస్తున్నట్టు తెలిపారు. పార్టీలో తనకు సహాకరించిన ప్రతీ ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. బడంగ్ పేట అభివృద్ధిని కాంక్షించి పార్టీలో చేరడం జరిగిందని, అప్పటి నుంచి నేటి వరకూ పార్టీ పిలుపునిచ్చిన ప్రతి కార్యక్రమం విజయవంతం చేయడం కోసం కృషి చేశామని ఆమె పేర్కొన్నారు.

టీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన పారిజాత.. త్వరలోనే కాంగ్రెస్ పార్టీలో చేరనున్నారు. మహేశ్వరంలోని నాయకులందరిని కలుపుకొని ముందుకు వెళ్తానని.. నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని బలోపేతం కోసం కృషి చేస్తామని వెల్లడించారు. తాను ఎంత కష్టపడినా పార్టీలో గుర్తింపు లేదని కొన్నాళ్లుగా అసంతృప్తిలో ఉన్నారు పారిజాత. ఈ కారణంగానే ఆమె రాజీనామా చేసినట్లు పారిజాత అనుచరులు వెల్లడించారు. ఈమె రెండేళ్ల పాటు టీఆర్ఎస్‌లో కొనసాగారు. పారిజాత రాజీనామా వ్యవహారం గులాబీ పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది.