భారత ప్రధాని నరేంద్ర మోడీకి మరో ఘనత

ప్రపంచంలో అత్యంత ప్రజాదరణ నేతగా మోడీ..మార్నింగ్ కన్సల్ట్ కంపెనీ వెల్లడి

PM Modi Shines Among Global Leaders; Leaves Behind Biden, Sunak, Macron in Latest Approval Rating

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీ మరో ఘనత సాధించారు. ప్రజాదరణ విషయంలో అమెరికా అధ్యక్షుడు బైడెన్ ను వెనక్కి నెట్టేశారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ కలిగిన నేతగా పొలిటికల్ ఇంటెలిజెన్స్ కంపెనీ ‘మార్నింగ్ కన్సల్ట్’ నిర్వహించిన సర్వేలో వెల్లడైంది. సర్వేలో పాల్గొన్న వారిలో 78 శాతం మంది మోడీకి తమ ఓటు వేశారు. మొత్తం 22 దేశాలకు చెందిన ప్రజల నుంచి సర్వేలో భాగంగా అభిప్రాయాలు తెలుసుకున్నారు.

ప్రధాని మోడీ తర్వాత మెక్సికో అధ్యక్షుడు ఆండ్రెస్ మాన్యుయేల్ లోపెజ్ ఒబ్రాడర్, స్విస్ అధ్యక్షుడు అలెన్ బెర్సెట్ ఉన్నారు. 2023 జనవరి 26 నుంచి 31వ తేదీల మధ్య సమీకరించిన తాజా డేటా ఆధారంగా ఈ వివరాలు వెల్లడిస్తున్నట్టు మార్నింగ్ కన్సల్ట్ తెలిపింది. ప్రతి దేశం నుంచి వయోజనులు వారం రోజుల్లో ఇచ్చిన రేటింగ్ ల సగటు ఫలితాలు ఇవని పేర్కొంది. లోపెజ్ ఒబ్రాడర్ కు 68 శాతం ఓటింగ్ లభించగా, అమెరికా అధ్యక్షుడు జోబైడెన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూ ఇద్దరూ 40 శాతం చొప్పున ప్రజాదరణతో నిలిచారు. భారత సంతతి బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ కు కేవలం 30 శాతం ప్రజాదరణ లభించింది.