మణిపూర్ ఘటన దేశానికి సిగ్గుచేటు..నిందితులను వదిలిపెట్టబోం : ప్రధాని మోడీ

PM Modi says Manipur violence is ‘shameful for any civil society

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీ మహిళను నగ్నంగా ఊరేగించిన మణిపూర్ ఘటనపై తీవ్రంగా స్పందించారు. వర్షాకాల సమావేశాల నేపథ్యంలో గురువారం పార్లమెంట్ కు వచ్చిన ప్రధాని.. కేంద్ర మంత్రులతో కలిసి మీడియాతో మాట్లాడారు. మణిపూర్ లో మహిళలను నగ్నంగా ఊరేగించిన వీడియోపై మోడీ స్పందించారు. ఈ ఘటనకు సంబంధించిన సమాచారం తెలిశాక తన హృదయం ఆవేదనతో నిండిపోయిందని చెప్పారు. ‘మణిపూర్ ఘటన దేశానికి సిగ్గుచేటు, నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదు.’ అని అన్నారు. ఈ అమానుష సంఘటన భారతీయులందరికీ సిగ్గుచేటని వ్యాఖ్యానించారు. శాంతి భద్రతలకు సంబంధించి.. ముఖ్యంగా మహిళల రక్షణకు సంబంధించి పటిష్టమైన చర్యలు తీసుకోవాలంటూ అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులకు మోడీ సూచించారు. మణిపూర్ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన మోడీ.. మహిళలపై వేధింపులను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించబోమని తేల్చిచెప్పారు. ఈ దారుణానికి పాల్పడిన వారిని వదలబోమని, చట్టప్రకారం కఠిన శిక్ష పడేలా చూస్తామని స్పష్టం చేశారు.

మణిపూర్‌లో ఇద్దరు మహిళలపై సామూహిక అత్యాచారం చేసి, ఆపై వారిని నగ్నంగా ఊరేగించారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. దీనిపై యావత్ భారతదేశం భగ్గుమంది. ప్రతిపక్షాలు ప్రధాని మోడీ లక్ష్యంగా తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.

కాగా, కేంద్ర ప్రభుత్వం కూడా ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించింది. ముందుగా ఈ వీడియో వైరల్ అయ్యేందుకు కారణమైన ట్విట్టర్‌పై చర్యలు తీసుకునేందుకు సిద్ధమైంది. లా అండ్ ఆర్డర్ సమస్యకు కారణమైన వీడియో వైరల్ అయ్యేందుకు దోహదపడిందనే కారణంతో ట్విట్టర్‌పై చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి.