ఏపీ అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యులతో పాటు వైస్సార్సీపీ ఎమ్మెల్యే కోటం సస్పెన్షన్

ఏపీ అసెంబ్లీ నుండి 12 మంది టీడీపీ ఎమ్మెల్యేల తో పాటు వైస్సార్సీపీ నుండి విజయం సాధించిన ఎమ్మెల్యే కోటంరెడ్డి ని సైతం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. కోటంరెడ్డి శ్రీధర్‌ రెడ్డి , పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. అలాగే మిగిలిన సభ్యులను ఒకరోజు పాటు సస్పెండ్ చేస్తున్నట్లు తెలిపారు.

హౌస్‌ను మిస్ లీడ్ చేసినందుకు, సభా కార్యకలాపాలకు పదే పదే అడ్డుతగిలినందుకు సస్పెండ్ చేస్తున్నామని స్పీకర్ తెలిపారు. దీంతో స్పీకర్‌కు వ్యతిరేకంగా టీడీపీ సభ్యులు నినాదాలు చేశారు. అంతకుముందు కేవలం ఇద్దరు టీడీపీ సభ్యులు పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడును మాత్రమే స్పీకర్ సస్పెండ్ చేశారు. గవర్నర్ రిసీవింగ్ అంశంపై సభలో చర్చ సందర్భంగా టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ తనకు అవకాశం కల్పించాలని పదే పదే అడిగారు. సుమారు 40 నిమిషాలకు పైగా సభలో అధికారపార్టీ మంత్రులు, సభ్యులు మాట్లాడుతున్న సమయంలో పయ్యావుల అడ్డుతగిలారు. ఈ క్రమంలో పయ్యావుల కేశవ్, నిమ్మల రామానాయుడు సస్పెండ్ చేస్తున్నట్లు స్పీకర్ ప్రకటించారు. అయితే ప్రభుత్వం నుంచి ఎలాంటి ప్రతిపాదన లేకుండా తమరెలా సస్పెండ్ చేస్తారని టీడీపీ సభ్యులు ప్రశ్నించారు.

టిడిపి తన వక్రబుద్ధిని మార్చుకోవాలని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ సూచించారు. గవర్నర్ కు సీఎం జగన్ స్వాగతం పలకలేదని టిడిపి తప్పుడు ప్రచారం చేస్తూందని ఆగ్రహం వ్యక్తం చేశారు. గవర్నర్ పై టీడీపీ సభ్యులు అమర్యాదగా ప్రవర్తిస్తున్నారని విమర్శించారు. టీడీపీ వ్యవహార శైలి సభ హక్కుల ఉల్లంఘన కిందకి వస్తుందని పేర్కొన్నారు. అవాస్తవ ప్రచారాలపై స్పీకర్ కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.