ఈ చిరస్మరణీయమైన కార్యక్రమంలో మీరూ చేరండిః ప్రధాని పిలుపు

pm-modi-praises-nris-before-leaving-for-uae-tour

న్యూఢిల్లీః ప్రధాని నరేంద్ర మోడీ విదేశాల్లో ఉంటున్న భారత సంతతి, ప్రవాస భారతీయులపై ప్రశంసలు కురిపించారు. ఇవాళ ఆయన యునైటెడ్‌ అరబ్‌ ఎమిరేట్స్‌ (యూఏఈ)కి పయనమయ్యారు. ఈ నేపథ్యంలో వెళ్లే ముందు ప్రధాని ‘ఎక్స్‌’ (ట్విటర్‌) వేదికగా ఎన్‌ఆర్‌ఐల గురించి ట్వీట్ చేశారు. వారి సేవలను మెచ్చుకున్నారు. యూఏఈలోని అబుదాబిలో జరగనున్న ‘అహ్‌లాన్‌ మోడీ’ కార్యక్రమంలో పాల్గొననున్న విషయం తెలిసిందే.

‘‘ప్రపంచ దేశాలతో భారత్‌ సంబంధాలను మరింత బలోపేతం చేసేలా మన ప్రవాసులు కృషి చేస్తున్నారు. అందుకు ఎంతో గర్వంగా ఉంది. సాయంత్రం ‘అహ్‌లాన్‌ మోదీ’ కార్యక్రమంలో వారిని కలిసేందుకు ఎదురుచూస్తున్నా. ఈ చిరస్మరణీయమైన కార్యక్రమంలో మీరూ చేరండి’’ అంటూ మోడీ ఎక్స్ వేదికగా ట్వీట్ చేసి పిలుపునిచ్చారు.

అబుదాబిలో జరిగే అతి పెద్ద భారత డయాస్పోరా (ప్రవాసులు) ఈవెంట్‌గా ప్రధాని పేర్కొన్నారు. ఈ ఈవెంట్ జాయెద్‌ స్పోర్ట్స్‌ సిటీ స్టేడియంలో జరగనుంది. దీనిలో 35 నుంచి 40 వేల మంది పాల్గొనే అవకాశం ఉన్నట్లు అంచనా. ఈ పర్యటనలో భాగంగా యూఏఈ అధ్యక్షుడు షేక్‌ మహ్మద్‌ బిన్‌ జాయేద్‌ అల్‌ నహ్యాన్‌తో భేటీ అవనున్న మోడీ.. అనంతరం అబుదాబిలో నిర్మించిన మొట్టమొదటి హిందూ దేవాలయాన్ని ప్రారంభించనున్నారు.