మోడీ ప్రభుత్వం పై రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రశంసలు

‘మేక్ ఇన్ ఇండియా’ విధానాన్ని ప్రోత్సహిస్తూ మోడీ సరైనపనే చేస్తున్నారన్న పుతిన్

PM Modi Is Right.. Putin’s Make In India Example To Russian Automakers

మాస్కోః రష్యా అధ్యక్షుడు పుతిన్ మరోసారి మోడీ ప్రభుత్వ విధానాలను ప్రశంసించారు. ప్రధాని మోడీ చేస్తోంది కరక్టేనంటూ కితాబిచ్చారు. రష్యాలో జరిగిన 8వ ఈస్టర్న్ ఎకనామిక్ ఫోరమ్ కార్యక్రమంలో పాల్గొన్న పుతిన్ ‘మేక్ ఇన్ ఇండియా’ విధానాన్ని ప్రస్తావించారు. రష్యాలో తయారైన కార్లనే రష్యన్లు వినియోగించాలని పుతిన్ సూచించారు. దేశీ ఉత్పత్తుల వినియోగానికి సంబంధించి మోడీ ఇప్పటికే తన విధానాల ద్వారా గొప్ప ఉదాహరణలు నెలకొల్పారని ఫోరమ్‌ను ఉద్దేశిస్తూ పుతిన్ ప్రసంగించారు.

‘‘గతంలో రష్యాలో తయారైన కార్లు మనకు అందుబాటులో ఉండేవి కావు. కానీ ఇప్పుడు ఉన్నాయి. అవి చూడటానికి కాస్తంత సాధారణంగా కనిపించొచ్చు. ఆడీ, బెంజ్ కార్లలా ఉండకపోవచ్చు. కానీ దీన్నో సమస్యగా చూడకూడదు. మనం ఇండియా లాంటి దేశాలు అవలంబిస్తున్న విధానాలను పాటించాలి. దేశీయంగా వాహనాలు తయారు చేయడంపై వారు దృష్టి పెట్టారు. మేక్ ఇన్ ఇండియా విధానాన్ని ప్రోత్సహిస్తూ ప్రధాని మోడీ సరైన పనే చేస్తున్నారనేది నా అభిప్రాయం’’ అని పుతిన్ పేర్కొన్నారు.