ఆరు నెల‌ల్లో జగన్ కు రిట‌ర్న్ గిఫ్ట్ ఇస్తా – నారా లోకేష్

టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్..సీఎం జగన్ కు ఛాలెంజ్ విసిరారు. 40 ఏళ్లుగా మచ్చలేకుండా స్వచ్ఛమైన రాజకీయం చేసిన చంద్రబాబు ను అరెస్ట్ చేసి జగన్ తప్పు చేసాడని.. ఆరు నెల‌ల్లో జ‌గ‌న్ కి రిట‌ర్న్ గిఫ్ట్ ఇచ్చే బాధ్య‌త వ్య‌క్తిగ‌తంగా తానే తీసుకుంటాన‌ని లోకేష్ అన్నారు. ఢిల్లీలో మంగ‌ళ‌వారం గౌర‌వ రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్ముని క‌లిసి 2019 నుంచి ఏపీలో ప్రతిపక్ష పార్టీలపై జరిగిన అరాచకాలు, స్కిల్ కేసులో చంద్రబాబు గారి అక్ర‌మ అరెస్టు రాష్ట్ర‌ప‌తి దృష్టికి తీసుకెళ్లారు. అనంత‌రం మీడియాతో లోకేష్ మాట్లాడారు.

అక్ర‌మ కేసులో అరెస్టు అయిన చంద్ర‌బాబుకి ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఉన్న అభిమానులు సంఘీభావం ప్ర‌క‌టిస్తున్నార‌ని తెలిపారు. ప్ర‌పంచంలో ఎక్క‌డున్నా తెలుగువారంతా ప్ర‌శాంతంగా ఉన్నార‌ని, శాంతియుతంగా త‌మ నిర‌స‌న తెలుపుతున్నార‌ని పేర్కొన్నారు. చంద్ర‌బాబు జ్యూడీషియ‌ల్ రిమాండ్ వెళ్తున్న‌ప్పుడే ప్ర‌భుత్వ-ప్రైవేటు ఆస్తులకి ఎటువంటి న‌ష్టం క‌ల‌గ‌కుండా ప్ర‌జాస్వామ్య‌బ‌ద్ధంగా నిర‌స‌న‌లు తెల‌పాల‌ని మాకు ఆదేశాలు ఇచ్చార‌ని, ప్ర‌పంచ‌వ్యాప్తంగా తెలుగువారంతా త‌మ నాయ‌కుడు నేర్పిన క్ర‌మ‌శిక్ష‌ణ‌ని ఫాలో అవుతూనే శాంతియుతంగా నిర‌స‌న తెలుపుతున్నార‌ని లోకేష్ చెప్పుకొచ్చారు.

ఏపీలో వైస్సార్సీపీ అరాచ‌క పాల‌న‌ని జాతీయ పార్టీల దృష్టికి తీసుకెళ్లాన‌న్నారు. భ‌విష్య‌త్తు గ్యారెంటీ,యువ‌గ‌ళం, వారాహి యాత్ర‌ల‌తో తాము ప్ర‌జ‌ల్లోకి వెళ్లకూడ‌ద‌నే జగన్ వ్యూహంలో భాగంగానే ఈ త‌ప్పుడు కేసులు, అక్ర‌మ అరెస్టులు చేస్తున్నార‌ని లోకేష్ మండిప‌డ్డారు. తాము ఏ తప్పు చేయ‌లేద‌ని,న్యాయ‌పోరాటం చేస్తున్నామ‌న్నారు.