కెనడా ప్రధానికి ఐఏఎఫ్ వ‌న్ విమానాన్ని ఆఫ‌ర్ చేసిన భార‌త్

India Offered To Fly Back Justin Trudeau On IAF One After Jet Snag

న్యూఢిల్లీః దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన జీ20 సదస్సు కోసం కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో భారత్ కు వచ్చిన విషయం తెలిసిందే. సదస్సు ముగిసిన తర్వాత ఆదివారమే ఆయన తిరిగి వెళ్లాల్సి ఉండగా.. విమానంలో సాంకేతిక సమస్య వల్ల హోటల్ లోనే పడిగాపులు కాయాల్సి వచ్చింది. సోమవారం నాటికీ విమానం మరమ్మతు పూర్తికాకపోవడంతో కేంద్ర ప్రభుత్వం స్పందించింది. కెనడా ప్రధాని తిరిగి వెళ్లడానికి భారత వాయుసేన విమానం ఏర్పాటు చేస్తామని ఆఫర్ చేయగా ట్రూడో వద్దన్నారని అధికారవర్గాలు తెలిపాయి. మరో విమానం పంపించాలంటూ తమ అధికారులకు ఫోన్ లో ఆదేశాలు జారీ చేసిన ట్రూడో.. ఆ విమానం వచ్చేంత వరకూ ఢిల్లీలోనే వేచి ఉండాలని నిర్ణయించుకున్నారు. ఢిల్లీలోని హోటల్ రూమ్ నుంచే ట్రూడో తన కార్యకలాపాలు పర్యవేక్షించారని కెనడా ప్రతినిధులు తెలిపారు. ఎట్టకేలకు మంగళవారం మధ్యాహ్నం కెనడా ప్రధానితో పాటు ఇతర అధికారులు ఢిల్లీ నుంచి కెనడాకు బయలుదేరారు.

కాగా, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోను తిరిగి తీసుకెళ్లడానికి ఆ దేశ ఎయిర్ ఫోర్స్ కు చెందిన సీసీ-150 పొలారిస్ విమానం ఆదివారం రాత్రి ఢిల్లీకి చేరుకుంది. ఎయిర్ పోర్టులో ల్యాండయ్యాక ఆ విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. దీనికి సంబంధించి కెనడా అధికారులు వివరాలను వెల్లడించలేదు. అయితే, విమానంలో కీలకమైన పార్ట్ ఒకటి మార్చాల్సిన అవసరం ఏర్పడిందని సమాచారం. మరమ్మతుకు ఆలస్యం కావడంతో ట్రూడో అధికారులకు ఫోన్ చేసి మరో విమానం పంపించాలని ఆదేశించారు.