పోప్ ఫ్రాన్సిస్‌ను భార‌త్‌కు ఆహ్వానించిన ప్ర‌ధాని

వాటిక‌న్ సిటీ : ప్ర‌ధాని న‌రేంద్ర‌మోడీ పోప్ ఫ్రాన్సిస్‌ను భార‌త్‌కు ఆహ్వానించారు. జీ-20 స‌ద‌స్సులో పాల్గొనేందుకు ఇట‌లీకి వెళ్లిన ప్ర‌ధాని మోడీ .. ఇవాళ వాటిక‌న్ సిటీలో పోప్ ఫ్రాన్సిస్‌తో భేటీ అయ్యారు. దాదాపు 30 నిమిషాల‌పాటు పోప్ ఫ్రాన్సిస్‌, ప్ర‌ధాని మోడీ వివిధ విష‌యాల‌పై మాట్లాడుకున్నారు. అనంత‌రం భార‌త్‌కు రావాల్సిందిగా పోప్‌కు ప్ర‌ధాని ఆహ్వానం తెలిపారు. త‌న‌కు పోప్ ఫ్రాన్సిస్‌తో ప‌లు అంశాల‌పై మాట్లాడే అవ‌కాశం ద‌క్కింద‌ని, ఆయ‌న‌ను తాను భార‌త్‌కు ఆహ్వానించాన‌ని భేటీ ముగిసిన అనంత‌రం ప్ర‌ధాని మోడీ ట్వీట్ చేశారు.

కాగా, పోప్ ఫ్రాన్సిస్‌కు భార‌త్‌లోని క్రైస్త‌వ సంఘాల నుంచి చాలా రోజులుగా ఆహ్వానం ఉన్న‌ది. దాంతో ఆయ‌న కూడా భార‌త్‌కు వెళ్లాల‌నుకుంటున్న‌ట్లు స‌మాచారం. అయితే భార‌త్‌లోని క్రైస్త‌వ సంఘాల నుంచి ఆహ్వానం ఉన్నా.. ప్ర‌భుత్వం నుంచి ఆహ్వానం లేదు. దాంతో ఆయ‌న భార‌త్‌లో ప‌ర్య‌టించ‌లేక‌పోయారు. ఇప్పుడు ప్ర‌భుత్వం నుంచి కూడా ఆహ్వానం అంద‌డంతో త్వ‌ర‌లోనే పోప్ ఫ్రాన్సిస్ భార‌త్‌కు వ‌చ్చే అవ‌కాశం ఉన్న‌ది. కాగా, 1999లో చివ‌రిసారి పోప్ జాన్ పాల్ భార‌త్‌లో ప‌ర్య‌టించారు. ఆ త‌ర్వాత ఇప్పుడు పోప్ ఫ్రాన్సిస్‌కు భార‌త్‌కు వ‌చ్చే అవ‌కాశం ఉంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/