రాహుల్‌.. మీకు మ‌త్స్య‌శాఖ ఉన్న విష‌యం కూడా తెలియ‌దా?

పుదుచ్చేరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన మోడి

న్యూఢిల్లీ: ప్రధాని నరేంద్రమోడి గురువారం పుదుచ్చేరిలో పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించిన ప్రధాని.. రాహుల్ వ్యాఖ్యలపై విమర్శలు గుప్పించారు. కేంద్రంలో మత్స్య శాఖ లేదన్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వ్యాఖ్యలపై ప్రధాని నరేంద్ర మోడి మండిపడ్డారు. 2019లోనే కేంద్ర ప్రభుత్వం మత్స్య శాఖ ఏర్పాటు చేసిందన్న విషయం కూడా రాహుల్ కు తెలియకపోవడం షాక్ కు గురిచేసిందన్నారు. ‘కేంద్రంలో మత్స్య శాఖ లేదని, దాని కోసం ఓ శాఖను ఏర్పాటు చేయాలని రాహుల్ చెప్పడంతో షాక్ అయ్యా. నిజానికి కేంద్రంలో మత్స్య శాఖ అనేది ఒకటుంది. 2019లోనే ఆ శాఖను ఏర్పాటు చేసింది కూడా మేమే’ అని ఆయన అన్నారు. బ్రిటీష్ వారు మన దేశాన్ని ఆక్రమించి ‘విభజించు-పాలించు’ అన్న సిద్ధాంతాన్ని అనుసరించిందని, కాంగ్రెస్ విధానం కూడా అదేనని అన్నారు.

కాంగ్రెస్ ది ‘విభజించు–అబద్ధమాడు–పాలించు’ సిద్ధాంతమని అన్నారు. అందులోని కొందరు నేతలు సందర్భానికి తగ్గట్టు ప్రాంతాల మధ్య, వర్గాల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. పుదుచ్చేరికి ‘హై కమాండ్’  పాలన అవసరం లేదన్నారు. కొందరు కాంగ్రెస్ నేతలకే లాభం కలిగేలా హైకమాండ్ కు తలూపుతున్నారని వ్యాఖ్యానించారు. కానీ, బిజెపికి ప్రజలే హైకమాండ్ అని అన్నారు.

అంతకుముందు పుదుచ్చేరిలో జవహర్ లాల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ పోస్ట్ గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, ఖేలో ఇండియా స్కీమ్ లో భాగంగా స్పోర్ట్స్ కాంప్లెక్స్ లో అథ్లెటిక్ ట్రాక్, సాగర్ మాల పథకంలో భాగంగా పుదుచ్చేరి పోర్ట్ డెవలప్ మెంట్, 56 కిలోమీటర్ల మేర ఎన్45ఏ విస్తరణకు ప్రధాని శంకుస్థాపన చేశారు. బాలికా క్రీడాకారుల కోసం వంద పడకల బాలికా వసతి గృహాన్ని ప్రారంభించారు.


తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/telangana/