దేశం కోసం చరణ్‌సింగ్‌ చేసిన ఎనలేని సేవలకు ఈ పురస్కారం అంకితంః ప్రధాని మోడీ

PM Modi dedicated this award to Charan Singh for his countless services to the nation

న్యూఢిల్లీః మాజీ ప్రధాని చౌధరి చరణ్‌సింగ్‌కు ‘భారతరత్న’ పురస్కారం ప్రకటించడం మా ప్రభుత్వం చేసుకున్న అదృష్టమని ప్రధాని నరేంద్రమోడీ పేర్కొన్నారు. దేశం కోసం ఆయన చేసిన ఎనలేని సేవలకు ఈ పురస్కారం అంకితం అని మోదీ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌ X (ఎక్స్‌) లో ట్వీట్ చేశారు. చరణ్‌ సింగ్‌ తన జీవితమంతా రైతుల హక్కులు, సంక్షేమం కోసమే అంకితం చేశారని ప్రధాని కొనియాడారు. చరణ్‌ సింగ్‌ ఒక ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు గానీ, ఉత్తరప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గానీ, కేంద్ర హోంమంత్రిగా ఉన్నప్పుడు గానీ దేశ అభివృద్ధికే ప్రాధాన్యం ఇచ్చారని ప్రధాని మోడీ ప్రశంసించారు. ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా కూడా ఆయన గట్టిగా నిలబడ్డారని గుర్తుచేశారు. రైతు సోదరసోదరీమణుల పట్ల ఆయన చూపిన అంకితభావం, ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య పరిరక్షణకు ఆయన చేసి కృషి యావత్‌ భారతదేశానికి ఆదర్శనీయమని మోడీ పేర్కొన్నారు.