పీఎం సూర్య ఘర్..ముప్త్ బిజ్లీ యోజన పథకాన్ని ప్రకటించిన ప్రధాని మోడీ

PM Modi announces ‘Muft Bijli Yojana’ to provide free electricity to 1 crore households

న్యూఢిల్లీః కోటి ఇళ్లకు ఉచిత విద్యుత్తును అందించేందుకు వీలుగా పీఎం సూర్య ఘర్: ముప్త్ బిజ్లీ యోజన పథకాన్ని ప్రధాని నరేంద్ర మోడీ మంగళవారం ప్రకటించారు. సౌర విద్యుత్ వినియోగాన్ని మరింత విస్తరించి సామాన్యులకు కరెంట్ ఛార్జీల భారం తగ్గించేలా ఈసారి బడ్జెట్‌లో కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ కీలక ప్రకటన చేశారు. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ఈ దిశలో అడుగు ముందుకు వేసింది. ఇందులో భాగంగా ప్రధాని ఈ పథకాన్ని ప్రకటించారు. ప్రధాని మోడీ ఎక్స్ వేదికగా ప్రకటన చేశారు.

మరింత స్థిరమైన అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం ‘పీఎం సూర్య ఘర్: ముఫ్త్ బిజ్లీ యోజన’ పథకాన్ని ప్రారంభిస్తున్నట్లు ప్రధాని మోడీ పేర్కొన్నారు. రూ.75వేల కోట్ల పెట్టుబడితో తీసుకువస్తున్న ఈ ప్రాజెక్టుతో ప్రతి నెల రూ.300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్‌ను అందించి కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. దీని కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తామన్నారు. రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి భారీ రాయితీపై రుణాలు పొందవచ్చునని తెలిపారు. ప్రజలపై ఎలాంటి వ్యయ భారం ఉండదన్నారు.