కేసీఆర్ జాతీయ పార్టీకి సంపూర్ణ మద్దతు తెలిపిన కుమారస్వామి

కేసీఆర్ స్థాపించబోయే జాతీయ పార్టీ కి సంపూర్ణ మద్దతు ఇస్తున్నట్లు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి హెచ్‌డీ కుమారస్వామి తెలిపారు. కేసీఆర్ జాతీయ రాజకీయాల్లోకి అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే. దసరా కు జాతీయ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఇతర పార్టీ నేతలతో భేటీ అవుతున్నారు. రీసెంట్ గా బీహార్ వెళ్లి సీఎం నితీష్ కుమార్ తో పాటు పలువురి తో సమావేశమయ్యారు. >ఈరోజు కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, జనతాదళ్ సెక్యులర్ నేత కుమారస్వామితో ప్రగతి భవన్ లో భేటీ అయ్యారు. ప్రగతి భవన్‌లో మూడు గంటల పాటు ఇద్దరు నేతలు సమాలోచనలు జరిపారు. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర, దేశ రాజకీయాల్లో కేసీఆర్‌ పోషించాల్సిన పాత్రపై సుదీర్ఘంగా చర్చించారు.

భేటీ అనంతరం కుమారస్వామి మాట్లాడుతూ..అన్ని వర్గాలను కలుపుకుంటూ ప్రత్యేక రాష్ట్రాన్ని సాధించిన కేసీఆర్ వంటి వ్యక్తులు జాతీయ రాజకీయాల్లోకి రావాల్సిన అవసరం ఉందని అన్నారు. దేశ రాజకీయాల్లో ప్రత్యామ్నాయ వేదిక ఏర్పాటుకు కేసీఆర్ క్రియాశీల పాత్ర పోషించాలన్నారు. అందుకు తమ సంపూర్ణ మద్దతు ఉంటుందని తెలిపారు. సీఎం కేసీఆర్ త్వరలోనే జాతీయ పార్టీని స్థాపించాలని కోరారు. వర్తమాన జాతీయ రాజకీయాల్లో కేసీఆర్ వంటి సీనియర్ లీడర్ ఆవశ్యకత చాలా ఉందని ఆయన అభిప్రాయపడ్డారు.

తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన ఎనిమిదేండ్ల స్వల్పకాలంలోనే తెలంగాణ సాధించిన అభివృద్ధిని చూసి, దేశమంతా చర్చిస్తున్నదని, తమకూ ఈ అభివృద్ధి కావాలని కోరుకుంటున్నదని ఈ సందర్భంగా కుమారస్వామి సీఎం కేసీఆర్‌కు అభింనదనలు తెలిపారు. దేశవ్యాప్తంగా పోల్చి చూస్తే, తెలంగాణ రాష్ట్రంలో మాత్రమే అమలవుతున్న 24 గంటల నాణ్యమైన ఉచిత విద్యుత్తు, ఉచిత తాగునీరు, సాగునీరు, వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలు, తదితర పథకాలపై దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చను ఈ సందర్భంగా సీఎం కేసీఆర్‌తో కుమారస్వామి పంచుకున్నారు. తెలంగాణ వంటి పాలన, పథకాలు.. కర్నాటక రాష్ట్రంతో సహా పక్క రాష్ట్రాల ప్రజలు కావాలని కోరుకుంటున్న నేపథ్యంలో, ఇదే విషయమై తమ దృష్టికి వచ్చిన అంశాలను సీఎం కేసీఆర్‌తో కుమారస్వామి చర్చించారు.