దయచేసి నన్ను అలా అనవద్దు..నితీశ్

పట్నా: బీహార్ సిఎంగా జేడీయూ అధినేత నితీశ్‌కుమార్ ఏడోసారి పదవి చేపట్టబోతున్నారు. ఈనేపథ్యంలో నితీశ్ తనపై వస్తున్న విమర్శలపై స్పందించారు. ప్రజలను మెప్పించని నేత సిఎంగా మారనున్నారని వస్తున్న వార్తలపై స్పందించిన ఆయన, తనను దురహంకారిగా, అహంభావిగా అభివర్ణించ వద్దని అన్నారు. కరోనా కారణంగా తాను ప్రజల్లోకి వెళ్లలేకపోయానని, అది కూడా జనతాదళ్ యునైటెడ్ కు సీట్లు తగ్గేందుకు కారణమైందని అన్నారు. తాజాగా ఓ టీవీ చానెల్ కు ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన, ‘దయచేసి నన్ను దురహంకారినని అనువద్దు’ అంటూ చేతులు జోడించి ప్రజలను వేడుకున్నారు. కరోనా సమయంలో తాను మౌనంగా ఉండటంవల్ల ప్రజలకు తనపై అసంతృప్తి పెరిగిందనడం కూడా కరెక్టు కాదని నితీశ్ కొట్టిపారేశారు. ప్రెస్ మీట్లు పెట్టకపోయినా కరోనా వైరస్ కట్టడి కోసం తాను అన్నివిధాలా కృషిచేశానని చెప్పారు. మొత్తం 243 అసెంబ్లీ స్థానాలున్న బిహార్ లో నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీ (యూ) కేవలం 43 స్థానాలకు మాత్రమే పరిమితమైన సంగతి తెలిసిందే. విపక్ష ఆర్జేడీ 75 సీట్లతో అతిపెద్ద పార్టీగా ఉన్నా, బిజెపితో కూటమిలో కలిసున్నందున నితీశ్ కు మరోసారి సిఎంగా పనిచేసే అవకాశం లభించింది.
తాజా అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/international-news/