నిర్భయ దోషుల లాయర్‌కు కోర్టు హెచ్చరిక

నిప్పుతో చెలగాటం ఆడుతున్నారు, జాగ్రత్తగా ఉండండి అన్న జడ్జి

Nirbhaya case convicts
Nirbhaya case convicts

న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనం రేపిన నిర్భయ ఉదంతంలోని దోషులకు రేపు ఉదయం 6 గంటలకు తీహార్ జైల్లో ఉరిశిక్షను అమలు చేయనున్నారు. ఈ తరుణంలో తమ ఉరిశిక్షపై స్టే విధించాలంటూ దోషులు ఢిల్లీలోని పటియాలా హౌస్ కోర్టులో పిటిషన్ వేశారు. రాష్ట్రపతికి తాను క్షమాభిక్ష పెట్టుకున్నానని, ఈ నేపథ్యంలో రేపటి ఉరితీత అమలును ఆపివేయాలంటూ పవన్ గుప్తా మరో పిటిషన్ వేశాడు.పిటిషన్ ను విచారించిన పటియాలా హౌస్ కోర్టు అడిషనల్ సెషన్స్ జడ్జి ధర్మేంద్ర రానా… తీర్పును రిజర్వ్ లో ఉంచుతూ, పవన్ తరపు న్యాయవాదిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. నిప్పుతో చెలగాటమాడుతున్నారని, జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. నలుగురు దోషుల్లో ఏ ఒక్కరు తప్పుగా వ్యవహరించినా పరిస్థితులు మారుతాయని… ఆ తర్వాత జరిగే పరిణామాలు ఎలా ఉంటాయో మీకు తెలుసని అన్నారు.

మరోవైపు పవన్ వేసిన క్యూరేటివ్ పిటిషన్ ను సుప్రీంకోర్టు ఈరోజు తిరస్కరించింది. దోషులకు ఉన్న అన్ని న్యాయపరమైన అన్ని ఆప్షన్స్ అయిపోయాయని సుప్రీం వ్యాఖ్యానించింది.

రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ కు పవన్ గుప్తా క్షమాభిక్ష పిటిషన్ పెట్టుకున్న నేపథ్యంలో… ఉరిశిక్ష రేపు అమలవుతుందా? అనే సందేహాలు నెలకొన్నాయి. పిటిషన్ ను రాష్ట్రపతి ఈరోజు తిరస్కరించినప్పటికీ… చట్టం ప్రకారం 14 రోజుల తర్వాతే ఉరి తీయాల్సి ఉంటుందని న్యాయ నిపుణులు చెబుతున్నారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండి:https://www.vaartha.com/news/business/