జపాన్ లో రన్ వేపై ఢీకొన్న రెండు విమానాలు..

జపాన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ఎయిర్ బస్ A350 విమానం ప్రమాదానికి గురైంది. దేశ రాజధాని టోక్యోలోని హనేడా (టోక్యో ఇంటర్నేషనల్ ఎయిర్ పోర్ట్) ఎయిర్పోర్టులో ఈ ఘటన జరిగింది. ఎయిర్ పోర్టు రన్ వేపై లాండింగ్ సమయంలో.. కోస్ట్ గార్డ్ విమానాన్ని జపాన్ ఎయిర్ లైన్స్ విమానం ఢీకొట్టింది. దీంతో జపాన్ విమానంలో మంటలు చెలరేగాయి. ఇందులో ఒకటి ప్రయాణీకుల విమానం కాగా… మరొకటి జపాన్ కోస్ట్ గార్డ్ కు చెందిన విమానం.

కోస్ట్ గార్డ్ విమానం జపాన్ పశ్చిమ తీరంలో భూకంప బాధితుల కోసం సహాయ సామగ్రి తీసుకుని వెళుతుండగా… రన్ వేపై ప్రయాణికుల విమానం ఢీకొట్టింది. కోస్ట్ గార్డ్ విమానంలో ఆరుగురు సిబ్బంది ఉండగా, ఫ్లయిట్ కెప్టెన్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. మిగతా ఐదుగురు సిబ్బంది మృతి చెందారు.

అటు, ప్రమాదం జరిగిన సమయంలో ప్రయాణికుల విమానంలో 379 మంది ఉన్నారు. వీరందరూ సురక్షితంగా బయటపడడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఘటనపై ఎయిర్ పోర్టు అధికారులు దర్యాప్తుకు ఆదేశించారు