రైతు ఆత్మ‌హ‌త్య‌ల‌పై నెల రోజుల్లోగా న్యాయం చేయాలి : నాదెండ్ల

రైతులు అంటే రైతులే..వారిలో కులాల‌ను చూసి ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డం దుర్మార్గం : జ‌న‌సేన నేత నాదెండ్ల ఆరోప‌ణ‌

అమరావతి: అన్న‌దాత‌ల ప‌ట్ల వైస్సార్సీపీ ప్ర‌భుత్వం ప్ర‌ద‌ర్శిస్తున్న వైఖ‌రి ప‌ట్ల జ‌న‌సేన రాజ‌కీయ వ్య‌వ‌హారాల క‌మిటీ చైర్మ‌న్ నాదెండ్ల మ‌నోహ‌ర్ ధ్వ‌జ‌మెత్తారు. కౌలు రైతుల‌ను కులం కోణంలో చూస్తున్నారంటూ ఆయ‌న ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. రైతులు అంటే రైతులే..వారిలో కులాల‌ను చూసి ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌ను అమ‌లు చేయ‌డం దుర్మార్గ‌మంటూ ఆయ‌న వైస్సార్సీపీ ప్ర‌భుత్వ తీరుపై విరుచుకుప‌డ్డారు. ఈ మేర‌కు గురువారం రాజ‌మ‌హేంద్ర‌వ‌రంలో నిర్వ‌హించిన మీడియా స‌మావేశంలో నాదెండ్ల మ‌నోహ‌ర్ వైస్సార్సీపీ స‌ర్కారుపై విమ‌ర్శ‌నాస్త్రాలు సంధించారు.

రాష్ట్రంలో రైతులు ఆత్మ‌హ‌త్య‌ల‌కు పాల్ప‌డుతున్నా జ‌గ‌న్ స‌ర్కారు స్పందించ‌డం లేద‌ని నాదెండ్ల ఆరోపించారు. కౌలు రైతుల‌కు కూడా రైతుల మాదిరే అన్ని ర‌కాల స‌హాయ స‌హ‌కారాలు అందిస్తామ‌ని చెప్పిన జ‌గ‌న్ స‌ర్కారు.. కౌలు రైతుల‌కు ఇచ్చే గుర్తింపు కార్డుల‌ను 5 ల‌క్ష‌ల‌కే ప‌రిమితం చేసింద‌ని ఆయ‌న ఆరోపించారు. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న కౌలు రైతుల‌కు రూ.7 ల‌క్ష‌ల న‌ష్ట ప‌రిహారం ఇవ్వాల్సిందేన‌ని ఆయ‌న డిమాండ్ చేశారు.

రాష్ట్రంలో కౌలు రైతుల‌కు ఎదుర‌వుతున్న స‌మ‌స్య‌లను త‌మ పార్టీ మాన‌వీయ సంక్షోభంగా ప‌రిగ‌ణిస్తోంద‌ని నాదెండ్ల చెప్పారు. ఆత్మ‌హ‌త్య‌లు చేసుకున్న రైతులు, కౌలు రైతుల కుటుంబాల‌కు నెల రోజుల్లోగా న్యాయం చేయాల‌ని డిమాండ్ చేసిన నాదెండ్ల.. ప్రభుత్వం స్పందించ‌ని ప‌క్షంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్ స్వ‌యంగా రంగంలోకి దిగుతార‌ని కూడా హెచ్చ‌రించారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/telangana/