వైసీపీ ఎమ్మెల్యే ఇంట్లో విషాద ఛాయలు

గుంటూరు జిల్లా మాచర్ల వైసీపీ ఎమ్మెల్యే ఇంట విషాదం నెలకొంది. నాగార్జున సాగర్‌ కుడి కాలువలో పడి వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డి సోదరుడి భార్య తో పాటు, వారి కుమార్తె మృతి చెందారు. గుంటూరు జిల్లా దుర్గి మండలం అడిగొప్పల సమీపంలో మంగళవారం రాత్రి ఈ ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో మదన్ మోహన్ రెడ్డి క్షేమంగా బయటపడగా.. ఆయన భార్య లావణ్య, కుమార్తె సుదీక్ష చనిపోయారు. అర్ధరాత్రి తర్వాత వీరి మృతదేహాలు బయటపడ్డాయి.

సంక్రాంతి పండగ నేపథ్యంలో షాపింగ్ కోసం మదన్ మోహన్ రెడ్డి.. తన భార్యాకుమార్తెతో కలిసి విజయవాడ కు వెళ్లారు. విజయవాడలో షాపింగ్ పూర్తి చేసుకొని తిరిగి ఇంటికి పయనమయ్యారు. ఈ క్రమంలో అడిగొప్పల దాటిన తర్వాత వీరి కారు ప్రమాదానికి గురయింది. ఎదురుగా వస్తున్న బైక్‌ను తప్పించే ప్రయత్నంలో.. కారు అదుపుతప్పి సాగర్ కుడి కాలువలోకి దూసుకెళ్లింది. కారు నడుపుతున్న మదన్ మోహన్ రెడ్డి విండ్ నుంచి బయటకు వచ్చి.. ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. అనంతరం పోలీసులు, బంధువులకు సమాచారం ఇచ్చారు. విషయం తెలిసి పిన్నెళ్లి రామకృష్ణా రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లారు. పోలీసులు కూడా చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. రెస్క్యూ సిబ్బంది రాత్రి నుంచి కారు కోసం గాలించారు. ముందుజాగ్రత్తగా బుగ్గవాగు రిజర్వాయర్ నుంచి నీరు దిగువకు వెళ్లకుండా నిలిపివేశారు. కారు కోసం గజఈత గాళ్లు తీవ్రంగా గాలించారు. ఐతే అర్ధరాత్రి దాటిన తర్వాత కారు ఆచూకి తెలిసింది. రాత్రి 2 గంటల సమయంలో ఓ భారీ క్రేన్ సాయంతో కారును బయటకు తీసుకొచ్చారు. అప్పటికే మదన్ మోహన్ రెడ్డి భార్య, కుమార్తె చనిపోయి ఉన్నారు. వారి మృతదేహాలను బయటకు తీసి.. పోస్టుమార్టం కోసం ఆస్పత్రికి తరలించారు.