ఈవీఎంలు వద్దు..బ్యాలెట్లు వాడండి: రాష్ట్రపతికి చత్తీస్‌గఢ్ సీఎం తండ్రి లేఖ

లేదంటే నా చావుకు అనుమతి ఇవ్వండి..ఈవీఎంలపై అనుమానాలు ఉన్నాయి

చత్తీస్‌గఢ్: చత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి భూపేశ్ బఘేల్ తండ్రి నందకుమార్ బఘేల్ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు సంచలన లేఖ రాశారు. ఇకపై దేశంలో జరిగే అన్ని ఎన్నికల్లోను ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలకు బదులుగా మళ్లీ బ్యాలెట్ పత్రాలనే ఉపయోగించాలని కోరారు. ఈవీఎంలపై అనుమానాలు ఉన్నందున మళ్లీ పాత పద్ధతినే అవలంబించాలని కోరారు. ఒకవేళ అలా జరగని పక్షంలో తన మరణానికి అనుమతి ఇవ్వాలని అన్నారు. పౌరుల రాజ్యాంగ హక్కులను యథేచ్ఛగా హరిస్తున్నారని, ప్రజాస్వామ్యానికి మూల స్తంభాలైన వ్యవస్థలన్నీ నాశనమవుతున్నాయని ఆ లేఖలో ఆవేదన వ్యక్తం చేశారు.

దేశ పౌరుల్లో భయం పెరుగుతోందని అన్నారు. ఇలాంటి వ్యవస్థలో తనకు బతకాలని లేదని అన్నారు. రాజ్యాంగాన్ని రక్షిస్తానని మీరు ప్రమాణం చేశారని గుర్తు చేసిన నందకుమార్.. తన రాజ్యాంగ హక్కులకు రక్షణ లేదని, కాబట్టి తనకు మరణం తప్ప మరో మార్గం లేదని అన్నారు. జనవరి 25న ఓటరు దినోత్సవాన్ని పురస్కరించుకుని తన మరణానికి అనుమతి ఇవ్వాలని నందకుమార్ ఆ లేఖలో రాష్ట్రపతిని కోరారు. కాగా, ఓటర్లను జాగృతం చేసే రాష్ట్రీయ మత్‌దాతా జాగృతి మంచ్‌కు నందకుమార్ అధ్యక్షుడిగా ఉన్నారు.

తాజా ఏపీ వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/andhra-pradesh/