ఒమిక్రాన్ పై అప్ర‌మ‌త్తంగా ఉండాలి: బైడెన్ హెచ్చరిక

న్యూయార్క్: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేప‌ధ్యంలో అమెరిక‌న్లు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని అధ్య‌క్షుడు జో బైడెన్ హెచ్చరించారు. ఇప్ప‌టివ‌ర‌కూ క‌రోనా వ్యాక్సిన్ తీసుకోని వారి నుంచి ఈ శీతాకాలంలో మర‌ణాలు, తీవ్ర అస్వ‌స్ధ‌త ఆస్ప‌త్రుల బారిన‌ప‌డే ముప్పు పొంచి ఉంద‌ని ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఒమిక్రాన్‌పై ఆరోగ్య నిపుణుల సూచ‌న‌పై బైడెన్ స్పందిస్తూ బూస్ట‌ర్ డోసులను వీలైనంత త్వ‌ర‌గా తీసుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

మీరు ఇప్ప‌టికే వ్యాక్సిన్ వేసుకుంటే మీరు త‌క్ష‌ణ‌మే బూస్ట‌ర్ డోసు తీసుకోవాల‌ని, అప్పుడే మీకు మ‌ర‌ణాలు, తీవ్ర అస్వ‌స్ధ‌త ముప్పు త‌ప్పుతుంద‌ని అన్నారు. వ్యాక్సిన్ తీసుకోకుంటే త‌క్ష‌ణ‌మే తొలి డోసు తీసుకోవాల‌ని బైడెన్ కోరారు. ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతోంద‌ని ప్ర‌జ‌లు వెంట‌నే బూస్ట‌ర్ డోసు తీసుకోవ‌డం కీల‌మ‌ని స్ప‌ష్టం చేశారు. మ‌రోవైపు అమెరికాలో ఇప్ప‌టివ‌ర‌కూ ఒమిక్రాన్ కేసుల న‌మోద‌య్యాయ‌ని 36 రాష్ట్రాలు నిర్ధారించాయి. మియామి, ఫ్లోరిడా రాష్ట్రాల్లో ఒమిక్రాన్ కేసుల పెరుగుద‌ల ఆందోళ‌న రేకెత్తిస్తోంది.

తాజా సినిమా వార్తల కోసం క్లిక్ చేయండి: https://www.vaartha.com/news/movies/