అజ్ఞాతం వీడిన వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి

ఈవీఎం ధ్వంసం కేసు తర్వాత అండర్ గ్రౌండ్‌లోకి వెళ్లిన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఎట్టకేలకు అజ్ఞాతం వీడారు. ఏపీ హైకోర్టు ఆదేశాలతో పల్నాడు జిల్లా ఎస్పీని కలిసిన పిన్నెల్లి బెయిల్ షరతుల ప్రకారం ఎస్పీ ఆఫీస్‌లో సంతకం చేసి వెళ్లిపోయారు. ఈ నెల 13న పోలింగ్ రోజున రెంటచింతల మండలం పాల్వాయి గేటు పోలింగ్ కేంద్రంలో ఈవీఎం ను ధ్వంసం చేసిన కేసులో ఇప్పటికే ఆయనకు హైకోర్టు ముందస్తు బెయిల్‌ మంజూరు చేయడం తెలిసిందే.

అయితే ఆ తర్వాత రోజు జరిగిన దాడులు, బాధితులను బెదిరించారనే ఆరోపణలపై పోలీసులు రెండు కేసులు పెట్టారు. అలాగే ఓ సీఐపై జరిగిన దాడి కేసులోనూ ఆయన పేరును ఎఫ్ ఐఆర్ లో చేర్చారు. దీంతో ఈ మూడు కేసుల్లోనూ తనకు ముందస్తు బెయిల్ ఇవ్వాలంటూ ఆయన ఏపీ హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసుల్లో సోమవారం ఇరుపక్షాల వాదనలు పూర్తికావడంతో తీర్పును రిజర్వ్ లో ఉంచిన న్యాయస్థానం.. మంగళవారం తీర్పు వెలువరించింది.

జూన్ 6వ తేదీ వరకు పిన్నెల్లిని అరెస్టు చేయరాదని పోలీసులను ఆదేశించింది. కౌంటింగ్ ముగిసే వరకు పిన్నెల్లిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని స్పష్టం చేసింది. ఈవీఎం ధ్వంసం కేసులో ముందస్తు బెయిల్ ఇస్తూ విధించిన షరతులే ఈ కేసులకూ వర్తిస్తాయని తెలిపింది. కేసుల తదుపరి విచారణను జూన్ 6వ తేదీకి వాయిదా వేసింది. అంతకుముందు.. సోమవారం జరిగిన విచారణ సందర్భంగా ఈ కేసుల్లో ఇంప్లీడ్ పిటిషన్ వేసిన నంబూరి శేషగిరిరావు, చెరుకూరి నాగశిరోమణి అనే ఫిర్యాదుదారుల తరఫున సీనియర్ న్యాయవాది పోసాని వెంకటేశ్వర్లు వాదనలు వినిపించారు. పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై తీవ్రమైన ఆరోపణలు వచ్చినందున అరెస్టు నుంచి రక్షణ కల్పిస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని కోరారు.