రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు వారందరికీ ఆహ్వానం – సీఎం రేవంత్

తెలంగాణ లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మొదటిసారి తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం జరగబోతుంది. ఈ క్రమంలో ఈ వేడుకలను అట్టహాసంగా జరిపేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇప్పటికే వేడుకలకు సంబదించిన ఏర్పాట్లపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి అధికారులతో సమావేశమై పలు ఆదేశాలు జారీచేశారు.

ఇక ఈ వేడుకలకు ముఖ్య అతిధిగా సోనియా ను ఆహ్వానించిన సీఎం రేవంత్.. రాష్ట్రంలోని ప్రముఖులను, ఉద్యమకారులను ఈ వేడుకల్లో భాగస్వామ్యం చేస్తామన్నారు. ప్రజాపాలనలో జరుపుకుంటున్న మొదటి ఉత్సవాలు కాబట్టి ఉద్యమకారులను భాగస్వాములను చేస్తామని తెలిపారు. వారందరికీ సముచిత గౌరవం దక్కుతుందని హామీ ఇచ్చారు. కోదండరాం నేతృత్వంలో జాబితాను తయారు చేస్తున్నట్లు చెప్పారు. తెలంగాణ ప్రజల అభీష్టం మేరకు సోనియా గాంధీ రాష్ట్రాన్ని ఇచ్చారన్నారు. తెలంగాణ ఇచ్చిన నేతగా సోనియాను ఆహ్వానించినట్లు చెప్పారు. సోనియా రాక కోసం కాంగ్రెస్ శ్రేణులు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నాయన్నారు.