ఫ్యామిలీ సభ్యులతో కలిసి విజయవాడ కు వచ్చిన మహేష్ బాబు
సూపర్ స్టార్ మహేష్ బాబు తన కుటుంబ సభ్యులతో కలిసి విజయవాడ కు వచ్చారు. రీసెంట్ గా సూపర్ స్టార్ కృష్ణ మరణించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయన అస్థికలను కృష్ణానదిలో కలిపేందుకు మహేష్ తన కుటుంబ సభ్యులతో కలిసి ప్రత్యేక విమానంలో గన్నవరానికి చేరుకున్నారు.
మహేష్ బాబు , ఘట్టమనేని ఆదిశేషగిరిరావు, టీడీపీ ఎంపీ గల్లా జయదేవ్, హీరో సుధీర్ బాబు, దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తదితరులు వచ్చారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి కృష్ణానది దుర్గా ఘాట్ కు చేరుకున్నారు. ఈ కార్యక్రమం అనంతరం వీరు తిరిగి హైదరాబాద్ కు బయల్దేరనున్నారు. మహేశ్ బాబు రాక నేపథ్యంలో పోలీసులు భారీ భద్రతను ఏర్పాటు చేశారు.
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో మార్పులకు నాంది పలికిన ఆంధ్ర జేమ్స్ బాండ్ కృష్ణ మృతి తో చిత్రసీమ షాక్ కు గురైంది. గుండెపోటుతో గచ్చిబౌలిలోని కాంటినెంటల్ హాస్పటల్ లో ఆదివారం చేరిన కృష్ణ.. మంగళవారం తెల్లవారుజామున మృతి చెందారు. కృష్ణ గుంటూరు జిల్లా తెనాలి మండలంలోని బుర్రిపాలెంలో 31 మే 1942లో జన్మించారు. ఆయన తల్లిదండ్రులు వీరరాఘవయ్య చౌదరి, నాగరత్న దంపతుల ఐదుగురి సంతానంలో కృష్ణ పెద్దవారు.