పింగళి వెంకయ్య కుమార్తె కన్నుమూత..

జాతీయ జెండా రూపకర్త పింగళి వెంకయ్య కుమార్తె ఘంటసాల సీతామహాలక్ష్మి (100) కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్ లోని పల్నాడు జిల్లా మాచర్లలో ప్రియదర్శిని కాలనీలో తన కుమారుడు జీవీ నరసింహారావు వద్ద ఆమె ఉంటున్నారు. కుమారుడి ఇంట్లోనే నిన్న రాత్రి ఆమె కన్నుమూశారు. వయోభారంతో పాటు గత కొంత కాలంగా అనారోగ్యంతో కూడా ఆమె బాధపడుతున్నారు. వందేళ్ల జెండా పండుగ సందర్భంగా గతేడాది సీఎం జగన్ మాచర్ల వచ్చి సీతామహాలక్ష్మితో పాటుగా కుటుంబ సభ్యులను సన్మానించారు. రూ 75 లక్షలను అందించారు. వచ్చే నెల 2న పింగళి వెంకయ్య జయంతి. దీనిని పురస్కరించుకొని కేంద్రం సీతామహాలక్ష్మిని ఢిల్లీ తీసుకెళ్లేంందుకు ఏర్పాట్లు చేస్తుండగా ఆమె కన్నుమూశారు. సీతామహాలక్ష్మి భర్త ఉగ్రనరసింహం. ఆమెకు ఆరుగురు పిల్లలు. వీరిలో ఒకరైన నరసింహం అధ్యాపకుడిగా పని చేసి రిటైర్ అయ్యారు.. మాచర్లలో ఉంటున్నారు. తాత పింగళి చరిత్రపై నరసింహం పుస్తకం రాశారు. స్వాతంత్య్ర కాలం నాటి అనుభవాలను తల్లి ద్వారా తెలుసుకొని పుస్తకంలో పొందుపరిచారు.

సీతామహాలక్ష్మి మృతి పట్ల ముఖ్యమంత్రి జగన్, టీడీపీ అధినేత చంద్రబాబు సంతాపాన్ని వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నట్టు జగన్ చెప్పారు. పింగళి వెంకయ్య గారి కుమార్తె సీతామహాలక్ష్మిగారి మరణం విచారకరమని చంద్రబాబు అన్నారు. దేశ స్వాతంత్ర్యోద్యమంలో తండ్రికి తోడుగా నిలిచి, ఆ తర్వాత పింగళి గొప్పదనం నేటి తరానికి తెలిసేలా సీతామహాలక్ష్మీ గారు ఎంతో కృషి చేశారని కొనియాడారు. సీతామహాలక్ష్మి గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ… వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని పేర్కొన్నారు.