చంద్రబాబు వరద ప్రభావిత ప్రాంతాల టూర్ ఫై విజయసాయి ట్వీట్

టీడీపీ అధినేత చంద్రబాబు గోదావరి వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తూ వైస్సార్సీపీ ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు పర్యటన ఫై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి వ్యంగంగా స్పందించారు. చంద్రబాబును టార్గెట్ చేస్తూ ట్వీట్ పెట్టారు. ఇందులో సాయం అందుతోందయ్యా అంటూ బాధితులు చంద్రబాబుకు చెప్పినట్లున్న వార్తా కథనం క్లిప్ ను కూడా తన ట్వీట్ కు జత చేశారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటిస్తున్న చంద్రబాబుకు బాధితులు తమకు సాయం అందడం లేదంటూ మొరపెట్టుకుంటున్నట్లు ఇవాళ టీడీపీ అనుకూల పత్రికల్లో వార్తలొచ్చాయి. దీంతో అదేమీ లేదు తమకు సాయం అందుతోందంటూ బాధితులు చెప్తున్నట్లు వైసీపీ పత్రిక సాక్షిలో వచ్చిన వార్తను తన ట్వీట్ కు జత చేసిన సాయిరెడ్డి… ప్రభుత్వం తమకు భోజనం, మంచినీళ్లు, వసతి కల్పిస్తోందని లంక గ్రామాల ప్రజలు చెప్పడంతో చంద్రబాబు దిగ్భ్రాంతికి గురైనట్లు సాయిరెడ్డి చెప్పుకొచ్చారు. దీంతో టీడీపీ నేతలు పడవలో నుంచి కిందకు దూకి హడావిడి చేశారన్నారు. ప్రచారం కోసం వరద ప్రాంతాలకు వెళ్తున్న చంద్రబాబు.. అక్కడ కాకుండా శ్రీలంకకు వెళ్తే ఎక్కువ ప్రచారం వస్తుందని సలహా ఇచ్చారు. అసలే సంక్షోభంతో అల్లాడుతున్న శ్రీలంకకు వెళ్లాలంటూ సాయిరెడ్డి చంద్రబాబుకు చేసిన సూచనపై టీడీపీ నేతలు, అభిమానులు మండిపడుతున్నారు.

ఇదిలా ఉంటె నిన్న చంద్రబాబు పర్యటనలో అపశృతి చోటుచేసుకుంది. రాజోలు మండలం సోంపల్లి దగ్గర బోటు దిగుతుండగా బరువు ఎక్కువై నీటిలో బోల్తా కొట్టింది. దీంతో బోటులో ఉన్న టీడీపీ మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు నీటిలో పడిపోయారు. వెంటనే అప్రమత్తమైన మత్స్యకారులు.. అందర్నీ సురక్షితంగా ఒడ్డుకు చేర్చారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఈఘటనలో మాజీ మంత్రులు పితాని సత్యనారాయణ, దేవినేని ఉమా, ఉండి ఎమ్మెల్యే రామరాజు, ఎమ్మెల్సీ మంతెన సత్యనారాయణ రాజు, తణుకు మాజీ ఎమ్మెల్యే రాధాకృష్ణ, కొందరు మీడియా ప్రతినిధులు, భద్రతా సిబ్బంది ఒక్కసారిగా నీటిలో పడిపోయారు. నదికి సమీపంలోనే ఈ ఘటన జరగడంతో పెను ప్రమాదం తప్పింది. లైఫ్‌జాకెట్ల సాయంతో నీటిలో పడిపోయిన వారిని సురక్షితంగా కాపాడారు. అందరూ ఒడ్డుకు చేరిన తర్వాత చంద్రబాబు రాజోలులంక బయల్దేరారు. ఈ ఘటన లో చంద్రబాబుకు ఏ ప్రమాదం జరగకపోవడం తో అంత ఊపిరి పీల్చుకున్నారు.