రాష్ట్రపత్ని అనడం తప్పే..అధిర్ రంజన్ చౌదరి

సోనియా గాంధీని వివాదంలోకి లాగొద్దు..వెనక్కి తగ్గిన అధిర్ రంజన్ చౌదరి

congress-leader-adhir-ranjan-chowdhury-says-he-accepted-his-mistake

న్యూఢిల్లీః రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును ఉద్దేశించి కాంగ్రెస్ అగ్రనేత అధిర్ రంజన్ చౌదరి ‘రాష్ట్రపత్ని’ అని సంబోధించడం తెలిసిందే. దీనిపై తీవ్ర విమర్శలు రావడంతో అధిర్ రంజన్ చౌదరి వెనక్కి తగ్గారు. తాను ‘రాష్ట్రపత్ని’ అనడం తప్పేనని అంగీకరించారు. త‌న వ్యాఖ్య‌లు బాధిస్తే తాను స్వ‌యంగా రాష్ట్ర‌ప‌తి ద్రౌప‌ది ముర్మును క‌లిసి క్ష‌మాప‌ణ చెబుతాన‌ని అన్నారు. ఈ ఉదంతంపై త‌న‌ను ఉరితీసినా తాను సిద్ధ‌మేన‌ని, పార్టీ అధినేత్రి సోనియా గాంధీని ఈ వివాదంలోకి ఎందుకు లాగుతున్నార‌ని అదిర్ రంజ‌న్ ప్ర‌శ్నించారు. తాను పొర‌పాటుగా ఈ వ్యాఖ్య‌లు చేశాన‌ని, రాష్ట్ర‌ప‌తిని అవ‌మానించాల‌నే ఆలోచ‌న కూడా త‌న‌కు లేద‌ని స్ప‌ష్టం చేశారు.

“ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ అధినేత్రి సోనియా గాంధీని వాళ్లు ఏమన్నారు? శశిథరూర్ భార్య గురించి ఏం మాట్లాడారు? రేణుకా చౌదరిపై ఏమన్నారు?? అంటూ ప్రశ్నించారు. తాను రాష్ట్రపత్ని వివాదానికి ఇంతటితో ముగింపు పలుకుతానని చౌదరి స్పష్టం చేశారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము అపాయింట్ మెంట్ కోరి, ఆమెను వ్యక్తిగతంగా కలిసి వివరిస్తారని వెల్లడించారు. ఎల్లుండి ఆమె అపాయింట్ మెంట్ లభిస్తుందని భావిస్తున్నట్టు తెలిపారు.

తాజా బిజినెస్‌ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/news/business/