బాలకృష్ణ ఫై విరుచుకుపడుతున్న ఏపీ మంత్రులు

హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే , ఎన్టీఆర్ తనయుడు , సినీ నటుడు నందమూరి బాలకృష్ణ ఫై వైస్సార్సీపీ మంత్రులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ ని కాస్త వైస్సార్ హెల్త్ యూనివర్సిటీ గా మార్చడం పట్ల రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ పార్టీ నేతలు , కార్య కర్తలే కాక నందమూరి ఫ్యామిలీ సభ్యులు సైతం జగన్ సర్కార్ ను తప్పుపడుతున్నారు. జూ. ఎన్టీఆర్ , కళ్యాణ్ రామ్ తదితరులు సోషల్ మీడియా ద్వారా స్పందించగా..తాజాగా బాలకృష్ణ జగన్ ప్రభుత్వం ఫై శాపనార్దాలు పెట్టారు. దీంతో వరుస పెట్టి వైస్సార్సీపీ మంత్రులు బాలకృష్ణ ఫై విరుచుకుపడుతున్నారు.

మంత్రి మేరుగు నాగార్జున స్పందిస్తూ… బాలకృష్ణా, ఒక్క ప్రభుత్వ ఆసుపత్రి కూడా టీడీపీ హయాంలో కట్టకపోయినా హెల్త్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరు పెలా పెట్టుకున్నారని ప్రశ్నించారు. “ఎన్టీఆర్ ను మీరంతా కలిసి చంపేశాకే కదా హెల్త్ యూనివర్సిటీకి ఆయన పేరు పెట్టింది… చేసిన పాపం పేరు పెడితే పోతుందా బాలకృష్ణా?” అంటూ ట్వీట్ చేశారు.

ఏపీ ఆరోగ్య మంత్రి విడదల రజని కూడా బాలకృష్ణపై ధ్వజమెత్తారు. “బాలకృష్ణా… ప్రభుత్వాసుపత్రులను పిల్లలను ఎలుకలు కొరికే ఆసుపత్రులుగా, సెల్ ఫోన్ల లైట్లలో ఆపరేషన్లు చేసే ఆసుపత్రులగా మార్చిన మీ ఎల్లో గ్యాంగ్…. ఇంకా మెడికల్ యూనివర్సిటీకి ఎన్టీఆర్ పేరే ఉండాలనుకుంటోంది… ఇది కరెక్టేనా?” అంటూ ప్రశ్నించారు.

“ప్రజల ఆరోగ్యం అంటే మీకెందుకంత చులకన? 104, 108 వాహనాలను పాడుపెట్టి, ఆరోగ్యశ్రీని చంపేసి హెల్త్ యూనివర్సిటీకి మాత్రం ఎన్టీఆర్ పేరు ఉంచాలని ఉద్యమం చేస్తారా?” అంటూ రజని ట్వీట్ చేశారు. అలాగే మంత్రి జోగి రమేష్‌ .. 3 రోజుల తరువాత బాలకృష్ణ స్పృహలోకి వచ్చినట్లు ఉన్నారని ఎద్దేవా చేశారు.

‘ఎన్టీఆర్‌ను ఈ జాతి నుంచి దూరం చేసిందెవరు? అని ప్రశ్నించారు. మీ తండ్రికి వెన్నుపోటు పొడిచిందెవరు? పార్టీని, ట్రస్ట్‌ను లాక్కుని, సీఎం పీఠంపై మీ బావ కూర్చోలేదా? అప్పుడు బాలకృష్ణ ఏం చేశారు? శునకం ఎవరు? ఆ శునకానికి తోక ఎవరు? చంద్రబాబుకు బుద్ధి చెప్పండి అన్న ఎన్టీఆర్ చివరి కోరికను మీరు నెరవేర్చలేదు. చంద్రబాబు విసిరిన ఎంగిలి మెతుకులు తిన్నదెవరు? ఎన్టీఆర్‌ను కూలదోసినప్పుడు బాలకృష్ణ నవ్వుతూ ఆనందించారు. అయినా మీ కూతురును ఆయన కొడుక్కి ఇచ్చి పెళ్లి చేశారు. సినిమాల్లోనే నువ్ హీరోవి. చంద్రబాబు రాసిచ్చిన స్క్రిప్టునే బాలకృష్ణ ట్వీట్‌ చేశారు.’ అని ఘాటైన పదజాలంతో తీవ్రంగా విమర్శించారు మంత్రి జోగి రమేష్.