కరోనా నివారణకు టాబ్లెట్ వచ్చేసింది..

కరోనా కట్టడిలో భాగంగా..ఫార్మా దిగ్గజం ఫైజర్ సంస్థ తయారుచేసిన టాబ్లెట్ ‘పాక్స్‌లోవిడ్'(Paxlovid)కు అమెరికా ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ (FDA) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికీ ప్రపంచ దేశాలపై వివిధ రూపాల్లో దాడి చేస్తూనే ఉంది.. అయితే, మహమ్మారి కట్టడికి అనేక పరిశోధనల తర్వాత.. వ్యాక్సిన్‌ అందుబాటులోకి వచ్చింది. ఆ తర్వాత భారత్‌లో ఒక ఫౌడర్‌ కూడా అందుబాటులోకి తెచ్చారు. ఇప్పుడు మహమ్మారి చికిత్సలో టాబ్లెట్‌ కూడా చేరింది.

అగ్రరాజ్యం అమెరికా చరిత్రలో తొలిసారిగా కోవిడ్‌పై పోరాటానికి తొలి మాత్రకు అనుమతి ఇచ్చింది. కొవిడ్ చికిత్సకు ఇంట్లోనే ఈ ఔషధాన్ని తీసుకోవచ్చని కంపెనీ ప్రతినిధులు తెలిపారు. ఈ టాబ్లెట్ తీసుకోవడం వల్ల ఆస్పత్రిలో చేరే ప్రమాదాన్ని88 శాతం తగ్గించడంతో పాటు తీవ్రమైన వ్యాధికి గురైన వారిలో మరణాలను నివారించవచ్చునని అధ్యయనంలో తేలింది. అమెరికా ప్రభుత్వ అనుమతి పొందిన తొలి కరోనా టాబ్లెట్ ఇదే కావడం విశేషం.

దాదాపు ఏడాది కిందట వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చినా, దాని తయారీ, పంపిణీలో సంక్లిష్టతల కారణంగా చిట్టచివరి మనిషికీ టీకాలు అందడంలేదు. అదీగాక చాలా మందిలో టీకాలపై ఉన్న తప్పుడు అభిప్రాయాలను పోగొట్టడం ప్రభుత్వాలకు సమస్యగా మారింది. డెల్టా, ఇతర వేరియంట్ల ఉధృతి తగ్గుతుందనుకునేలోపే సౌతాఫ్రికా నుంచి పుట్టుకొచ్చిన ఒమిక్రాన్ ఇప్పుడు ప్రపంచానికి కొత్త ముప్పుగా వాటిల్లింది. వ్యాక్సిన్‌పై ఎంత ప్రచారం చేసినా.. పూర్తిస్థాయిలో వ్యాక్సినేషన్‌కు అందరూ ముందుకు రాకపోవడంతో.. ఇప్పుడు కోవిడ్ చికిత్సలో చేరిన తొలి టాబ్లెట్ కీలక పాత్ర పోషిస్తుందనే అభిప్రాయాలున్నాయి.