ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కార్యాలయం వద్ద ఉద్రిక్తత

ఎమ్మెల్సీ ఎన్నికల్లో క్రాస్ ఓటింగ్ కు పాల్పడ్డారంటూ వైస్సార్సీపీ అధిష్టానం నలుగురు ఎమ్మెల్యే లపై వేటు వేసిన సంగతి తెలిసిందే. కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి, ఆనం రామనారాయణ రెడ్డి, ఉండవల్లి శ్రీదేవి, మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి లు క్రాస్ ఓట్ వేశారని వైస్సార్సీపీ తేల్చింది. ఈ క్రమంలో గుంటూరు లోని ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి కార్యాలయం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. కార్యాలయంలోని సమీపంలో వున్న ఉండవల్లి శ్రీదేవి ఫ్లెక్సీలను వైస్సార్సీపీ కార్యకర్తలు చించేశారు. అంతేకాకుండా ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా వారు నినాదాలు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని నేతలు, కార్యకర్తలకు సర్ది చెప్పారు.

మరోపక్క సస్పెన్షన్ గురైన కోటంరెడ్డి , మేకపాటి సస్పెన్షన్ సానుకూలంగా స్పందించారు. సస్పెన్షన్ వల్ల ఎంతో రిలాక్స్ గా ఉందన్నారు మేకపాటి. మంచి చేసిన వారికి కూడా కొందరు చెడు చేస్తారని మేకపాటి వ్యాఖ్యానించారు. అనుకున్నది చేసేయడం వైస్సార్సీపీ లో అలవాటుగా మారిందని విమర్శించారు. జగన్ కు మద్దతు ఇచ్చినందుకు పార్టీలో చాలా మర్యాదలు చేశారన్నారు. తన నియోజకవర్గాన్ని భ్రష్టుపట్టించారని తెలిపారు. కావాలంటే ఇప్పుడే రాజీనామా చేస్తా… ఎవరు గెలుస్తారో చూద్దాం అంటూ మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి సవాల్ విసిరారు. పార్టీ అగ్రనేతలకు మానవతా విలువలు అవసరం అని హితవు పలికారు.

ఇక మరో ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సస్పెన్షన్ ఫై స్పందించారు. తనపై చర్యలు తీసుకున్న విధానం సరికాదని కోటంరెడ్డి అభిప్రాయపడ్డారు. ఇది ప్రజాస్వామ్య వ్యవస్థకు విఘాతం అని పేర్కొన్నారు. పార్టీ పరంగా ఏదైనా నిర్ణయం తీసుకుంటే, మొదట షోకాజ్ నోటీసులు ఇచ్చి వివరణ కోరాలని అన్నారు. ప్రజాస్వామ్య పద్ధతిలో చర్యలు తీసుకోలేదన్న విషయం స్పష్టమైందని, పార్టీలో పెత్తందారీ విధానం నడుస్తోందని కోటంరెడ్డి విమర్శించారు. ఏదేమైనా, పార్టీ నిర్ణయాన్ని తాను స్వాగతిస్తున్నానని తెలిపారు.