బండి సంజయ్ అరెస్ట్ ఫై హైకోర్టు లో పిటిషన్ దాఖలు

బండి సంజయ్ అరెస్ట్‌‌పై తెలంగాణ హైకోర్టులో బిజెపి పిటిషన్ దాఖలు చేసింది. బండి సంజయ్‌ను అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ హైదరాబాద్ జిల్లా అధ్యక్షుడు సాంరెడ్డి సురేందర్ రెడ్డి హైకోర్టులో హెబియస్ కార్పస్ పిటిషన్‌‌ను దాఖలు చేశారు. మొత్తం ఆరుగురిని బీజేపీ ప్రతివాదులుగా చేర్చింది. హోం శాఖ కార్యదర్శి, డీజీపీ, కరీంనగర్, రాచకొండ సీపీలు, బొమ్మలరామారం సీఐలను ప్రతివాదులుగా చేర్చుతూ బీజేపీ పిటిషన్‌ను దాఖలు చేసింది. సాంరెడ్డి సురేందర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌కు హైకోర్టు అనుమతి ఇచ్చింది. గురువారం ఉదయం విచారించేందుకు అనుమతి ఇచ్చింది.

మరోపక్క బండి సంజయ్ అరెస్టును తీవ్ర స్థాయిలో ఖండించింది బీజేపీ లీగల్ సెల్. సంజయ్ అరెస్ట్ పూర్తిగా అక్రమం అని.. ఎఫ్ఐఆర్‌లో నమోదు చేసిన సెక్షన్‌ ప్రకారం స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారని.. అయితే, కరీంనగర్‌లో అరెస్ట్, బొమ్మలరామారం పోలీస్ స్టేషన్ తరలించడం.. అక్కడి నుంచి జనగామ జిల్లాల వైద్య పరీక్షలు నిర్వహించడం. వరంగల్ కోర్టుకు తీసుకురావడం ఇవన్నీ పోలీసులు తమ ఇష్టం వచ్చినట్టుగా చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఒక ప్రజా ప్రతినిధిగా ఆయనకు అనేక మెసేజ్లు వస్తుంటాయని వీటికి ఓ ఎంపీపై ఇలా కేసులు పెట్టడం సరికాదన్నారు.