గంటా రాజీనామా ఆమోదంః అసెంబ్లీలో స్పీకర్ ప్రకటన

వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాజీనామా

Ganta Srinivasa Rao
Ganta Srinivasa Rao

అమరావతిః టిడిపి ఎమ్మెల్యే, మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు రాజీనామాను ఆమోదించినట్టు అసెంబ్లీ వేదికగా స్పీకర్ తమ్మినేని సీతారాం ప్రకటించారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ 2021 ఫిబ్రవరి 6న ఎమ్మెల్యే పదవికి గంటా రాజీనామా చేశారు. అయితే, ఆ రాజీనామాపై ఇంతకాలం ఎలాంటి చర్యలు తీసుకోని స్పీకర్… రెండు వారాల క్రితం ఆమోదించారు.

తన రాజీనామాను ఆమోదించిన రోజు గంటా స్పందిస్తూ.. పవిత్రమైన ఆశయం కోసం తాను రాజీనామా చేశానని చెప్పారు. రాజీనామా తర్వాత స్పీకర్ ను వ్యక్తిగతంగా పలు మార్లు కలిసి రాజీనామాను ఆమోదించాలని కోరినప్పటికీ… ఆయన ఆమోదించలేదని తెలిపారు. తన రాజీనామా లేఖను కోల్డ్ స్టోరేజ్ లో ఉంచిన స్పీకర్… ఇప్పుడు కుట్ర కోణంతో తనను అడగకుండానే ఆమోదించారని మండిపడ్డారు. రాజ్యసభ ఎన్నికల నేపథ్యంలో రాజీనామాను ఆమోదించారని దుయ్యబట్టారు. తన రాజీనామాను ఆమోదించడంపై న్యాయ పోరాటం చేస్తానని చెప్పారు.