కోటంరెడ్డి నమ్మకద్రోహం చేశాడంటూ పేర్ని నాని విమర్శలు

ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సీఎం జగన్ కు నమ్మక ద్రోహం చేసారని ఆరోపించారు మాజీ మంత్రి పేర్ని నాని. కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డిది ఫోన్ ట్యాపింగ్ కాదని, అది రికార్డింగ్ మాత్రమేనని, కోటంరెడ్డికి సన్నిహితుడైన నెల్లూరుకు చెందిన కాంట్రాక్టర్, జగన్ వీరాభిమాని రామశివారెడ్డి అనే వ్యక్తి ఫోన్ రికార్డింగ్ చేసి అందరికీ పంపించాడని మాజీ మంత్రి పేర్ని నాని అన్నారు. డిసెంబర్ 25 వ తేదీనే కోటంరెడ్డి బ్లూ బెంజ్ కారులో నారా లోకేష్ ని కలిశాడని నాని ఆరోపించారు.
ఇంటెలిజెన్స్ అధికారి ఆడియో క్లిప్పింగ్‌తో పాటు ‘ప్లీజ్ చెక్’ అని టెక్స్ట్ మేసేజ్ కూడా పంపించారన్నారు. బయట సర్క్యూలేట్ అవుతుంది ఒకసారి చెక్ చేసుకోమని కోటంరెడ్డికి పంపిస్తే దానిలో తప్పేముందని ప్రశ్నించారు. అది తప్పు అయితే కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి వాట్సాప్ చాట్ బయటపెట్టాలన్నారు. ఆ క్లిప్పింగ్‌తో పాటు ప్లీజ్ చెక్ అనే టెక్స్ట్ మేసేజ్ ఉందా.. లేదా కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి చెప్పాలన్నారు.
అధికార పార్టీలో ఉండి ప్రతిపక్ష పార్టీలకు టచ్ లో ఉండొచ్చా అని ప్రశ్నించారు. సీఎం జగన్ అందరినీ నమ్ముతారని అన్నారు. నెల్లూరు నారాయణతో టచ్ లో ఉండాలని కోటంరెడ్డికి చంద్రబాబు చెప్పారని ఆరోపించారు పేర్ని నాని. కోటంరెడ్డి జగన్ కు నమ్మకద్రోహం చేశారని వండిపడ్డారు. మా ఎమ్మెల్యేలపై మేమే ఎందుకు నిఘా పెట్టుకుంటామని ప్రశ్నించారు. సీఎం జగన్ పై కోటంరెడ్డి చేసిన ఆరోపణలను ఆయన విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు.
డిసెంబర్ 25వ తేదీన కోటంరెడ్డి బ్లూకలర్ బెంజ్ కారు వేసుకొని చంద్రబాబు ఇంటికి వచ్చి రెండు గంటల పాటు మాట్లాడి వెళ్లాడని టీడీపీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు చెబుతున్నారన్నారు. రెగ్యులర్‌గా నారాయణతో ఉన్న సంబంధాన్ని ఇప్పుడూ కంటిన్యూ చేయమని చంద్రబాబు చెప్పినట్టు టీడీపీకి చెందిన నేతలే చెబుతున్నారన్నారు. లోకేష్‌తోనూ కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి రెగ్యులర్‌గా మాట్లాడుతున్నట్టుగా చెబుతున్నారు. లోకేష్ పాదయాత్రకు ముందు కూడా కోటంరెడ్డిని సలహాలు అడిగినట్టు ఆయన పక్కనున్నవారే చెబుతున్నారు. ఆస్పత్రిలో ఉన్నప్పుడు ఫోన్ చేసి పరామర్శించాడని టీడీపీ నేతలు, కోటంరెడ్డి పక్కనున్నవారే చెబుతున్నారు.
తాను చనిపోయిన తరువాత ముఖ్యమంత్రి హోదాలో వైయస్ జగన్ వచ్చి తన మృతదేహానికి దండ వేయాలని, తన ఊపిరి ఉన్నంత వరకు వైయస్ జగన్ వెంటే ఉంటానని కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి గతంలో మాట్లాడారని పేర్ని నాని గుర్తుచేశారు.