ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో కొత్త నిబంధనలు

New rules of UP Assembly: No mobile phones, tearing of documents, laughing out loud

లక్నో: ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీలో పలు కొత్త నిబంధనలు అమలులోకి రానున్నాయి. సభలో బిగ్గరగా నవ్వరాదు. పత్రాలు చించకూడదు. మొబైల్‌ ఫోన్లు తీసుకురావద్దు. స్పీకర్‌కు వెన్ను చూపేలా నిల్చోవడం లేదా కూర్చోవడం చేయరాదు. ఈ మేరకు ఉత్తరప్రదేశ్ శాసనసభ విధివిధానాలు, సభలో ప్రవర్తనకు సంబంధించిన కొత్త నియమాల బిల్లు 2023ను సోమవారం అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. బుధవారం చర్చ జరిపిన తర్వాత ఈ బిల్లును ఆమోదించనున్నట్లు యూపీ అసెంబ్లీ స్పీకర్‌ సతీష్ మహానా తెలిపారు.

కాగా, కొత్త నిబంధనల ప్రకారం, శాసనసభ్యులు సభలో ఎలాంటి పత్రాలను చించే వీలుండదు. అలాగే వారు మాట్లాడుతున్నప్పుడు గ్యాలరీలో ఎవరి వైపైనా చూడటం లేదా ప్రశంసించడం చేయకూడదు. సభ్యులు వంగి స్పీకర్‌ స్థానాన్ని గౌరవించాలి. ఎమ్మెల్యేలు సభలోకి ప్రవేశించేటప్పుడు లేదా బయటకు వెళ్లేటప్పుడు లేదా కూర్చున్నప్పుడు లేదా వారి సీట్ల నుంచి లేచేప్పుడు స్పీకర్‌కు వీపు చూపకూడదు. అలాగే సభలోకి ఆయుధాలు తీసుకురావడం లేదా ప్రదర్శించడం నిషేధం. సభ్యులు లాబీలో పొగతాగరాదు. బిగ్గరగా మాట్లాడటం లేదా నవ్వడం చేయకూడదు.

మరోవైపు కొత్త నిబంధనల ప్రకారం ఉత్తరప్రదేశ్‌ అసెంబ్లీ సమావేశాల వ్యవధిని ప్రస్తుతం ఉన్న 14 రోజుల నుంచి ఏడు రోజులకు అంటే సగానికి తగ్గించనున్నారు. అలాగే సభ్యులు ఎటువంటి సాహిత్యం, ప్రశ్నాపత్రం, పుస్తకం లేదా పత్రికా వ్యాఖ్యలను సభలోకి తీసుకురాకూడదు. ప్రొసీడింగ్‌లకు సంబంధించిన స్లిప్పులను పంపిణీ చేయడానికి అనుమతించరు. అలాగే ఎమ్మెల్యేలకు రోజువారీ విధులను శాసనసభ ప్రధాన కార్యదర్శి ద్వారా ఆఫ్‌లైన్‌ లేదా ఆన్‌లైన్‌లో కేటాయిస్తారు.