వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ పర్యటన

మిచౌంగ్ తుఫాన్ వరద ప్రభావిత ప్రాంతాల్లో సీఎం జగన్ నేడు పర్యటించబోతున్నారు. ముందుగా తిరుపతి జిల్లా వాకాడు మండలం బాలిరెడ్డి పాలెం వెళ్లనున్న జగన్.. అక్కడ స్వర్ణముఖి నది కట్ట తెగి నష్టపోయిన ప్రాంతాలను పరిశీలిస్తారు. ఆ తర్వాత బాపట్ల జిల్లా మరుప్రోలువారిపాలెం వెళ్లనున్నారు. అక్కడ తుఫాన్ బాధితులతో సీఎం నేరుగా మాట్లాడనున్నారు. అనంతరం కర్లపాలెం మండలం పాతనందాయపాలెం చేరుకుని బాధిత రైతులను పరామర్శించనున్నారు. అక్కడి నుంచి బుద్దాంలో దెబ్బతిన్న వరి పంటను పరిశీలించి రైతులతో సమావేశం కానున్నారు.

మధ్యాహ్నం ఒంటిగంటకు హెలికాప్టర్లో బాపట్ల చేరుకోనున్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి.. ఆ జిల్లాలో కర్లపాలెం మండలం, పాతనందాయపాలెం వద్ద నీటిలో ఉన్న మిర్చి పంట, బుద్దాం దగ్గర తుంగభద్ర కాల్వ పక్కనే నీట మునిగిన వరి పంటను పరిశీలిస్తారని అధికారులు వెల్లడించారు.