టిడిపి సేవామిత్ర యాప్ ను దుర్వినియోగం చేశారుః భూమన కరుణాకర్ రెడ్డి

మధ్యంతర నివేదికను సభ ముందుంచిన కమిటీ

Bhumana Karunakar Reddy

అమరావతిః గత టిడిపి ప్రభుత్వం విపక్ష సభ్యులపై నిఘా వేసేందుకు ఇజ్రాయెల్ నుంచి పెగాసస్ సాఫ్ట్ వేర్ ను కొనుగోలు చేసి వినియోగించిందన్న ఆరోపణలపై నిగ్గు తేల్చేందుకు ఏపీ అసెంబ్లీ హౌస్ కమిటీ ఏర్పాటైన సంగతి తెలిసిందే. భూమన కరుణాకరెడ్డి చైర్మన్ గా ఈ పెగాసస్ సభా సంఘాన్ని స్పీకర్ అప్పట్లో ప్రకటించారు. తాజాగా, భూమన కరుణాకర్ రెడ్డి నేతృత్వంలోని కమిటీ మధ్యంతర నివేదికను రూపొందించింది. ఈ నివేదికను నేడు సభ ముందు ఉంచినట్టు భూమన కరుణాకర్ రెడ్డి వెల్లడించారు. గత ప్రభుత్వం డేటా చోరీకి పాల్పడినట్టు ప్రాథమిక నిర్ధారణకు వచ్చినట్టు పేర్కొన్నారు. అయితే, దీనిపై సేకరించాల్సిన సమాచారం చాలా ఉందని, అనేకమందిని విచారించాల్సి ఉందని భూమన చెప్పారు. ఇందుకు సంబంధించి లోతైన పరిశోధన చేస్తున్నామని అన్నారు.

గత ప్రభుత్వ హయాంలో ఆ ప్రభుత్వానికి ఓటు వేయనివారి సమాచారాన్ని సేకరించారని, ప్రభుత్వం వద్ద స్టేట్ డేటా సెంటర్ లో ఉండాల్సిన సమాచారాన్ని టిడిపికి సంబంధించిన సేవామిత్ర యాప్ ద్వారా పూర్తిగా చోరీ చేశారని ఆరోపించారు. తమకు ఓటు వేయని దాదాపు 30 లక్షల మందికి చెందిన ఓట్లను రద్దు చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందని అన్నారు. సేవామిత్ర యాప్ ను ఈ విధంగా దుర్వినియోగం చేశారని విమర్శించారు. ఈ డేటా తస్కరణకు పాల్పడిన వారిని పట్టుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/telangana/