బుగ్గన రాష్ట్ర ప్రజలకు మాయా ప్రపంచం చూపే ప్రయత్నం చేశారంటూ పయ్యావుల కేశవ్ కామెంట్స్

వైస్సార్సీపీ ప్రభుత్వ చిట్టచివరి బడ్జెట్ (2023-24) ద్వారా ఎప్పటిలానే ఆర్థికమంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి రాష్ట్ర ప్రజలకు మాయా ప్రపంచం చూపే ప్రయత్నం చేశారని టీడీపీ నేత పయ్యావుల కేశవ్ విమర్శించారు. బుగ్గన మాటలు కోటలు దాటు తుంటే, ప్రభుత్వ చేతలు మాత్రం గడప కూడా దాటడం లేదనేలా బడ్జెట్ ఉందని కేశవ్ వ్యాఖ్యానించారు.

2023- 24 వార్షిక బడ్జెట్‌ ను ఏపీ ఆర్థిక మంత్రి బుగ్గనరాజేంద్రనాథ్ రెడ్డి గురువారం ఉదయం శాసనసభలో ప్రవేశపెట్టారు. మొత్తం రెండు లక్షల 79 వేల 279.27 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్‌ను మంత్రి సభ ముందు ఉంచారు. ఈ బడ్జెట్ ఫై ప్రతిపక్ష పార్టీలు విమర్శలు చేస్తున్నాయి. తాజాగా టీడీపీ ఎమ్మెల్యే, ప్రజాపద్దుల కమిటీ (పీఏసీ) ఛైర్మన్ పయ్యావుల కేశవ్ స్పందించారు.

బడ్జెట్లో పెరుగుతున్న లక్షల కోట్ల అభివృద్ధి, క్షేత్రస్థాయిలో ఎక్కడా కనిపించడం లేదని కేశవ్ విమర్శించారు . సాగునీటి రంగం, ఇతర ప్రధాన రంగాలకు టీడీపీ ప్రభుత్వం పెట్టిన ఖర్చుతో పోలిస్తే, ఈ 4 ఏళ్లలో వైస్సార్సీపీ ప్రభుత్వం చేసిన ఖర్చు చాలా చాలా తక్కువ అని పేర్కొన్నారు. గడచిన నాలుగేళ్లలో వివిధ ప్రధాన రంగాలకు జగన్ ప్రభుత్వం రూ.20 వేల కోట్లు కూడా ఖర్చుపెట్టలేదు. అవి కూడా పాత బిల్లుల చెల్లింపులకే. అంటే రూ.10 వేల కోట్లు కూడా ఖర్చుపెట్టలేదు. ఉదాహరణకు చంద్రబాబు హయాంలో కేటాయింపులు రూ.100 ఉంటే, ఖర్చు రూ.95 ఉండేది. వైస్సార్సీపీ ప్రభుత్వంలో ఖర్చులు రూ.40, 50కే పరిమితం అయ్యాయని కేశవ్ అన్నారు.