బీసీలు గుడ్డిగా వైసీపీని నమ్మితే.. కులానికి ద్రోహం చేసినట్లే – పవన్

బీసీలు గుడ్డిగా వైసీపీ నాయకులను గనుక నమ్మితే కులానికి ద్రోహం చేసినవారవుతారు అని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ అన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జయహో బీసీ పేరిట భారీ సభ నిర్వహించారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ లతో పాటు ఇరు పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా బీసీ డిక్లరేషన్‌ ను అధినేతలు ఆవిష్కరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టబోయే వివిధ అంశాలను ప్రస్తావిస్తూ బీసీ డిక్లరేషన్‌ రూపొందించారు. మొత్తం 10 అంశాలతో డిక్లరేషన్‌ ను సిద్ధం చేసారు.

ఇక ఈ సభలో పవన్ మాట్లాడుతూ..బీసీ కులాలు భారతదేశపు సంస్కృతికి, సంప్రదాయాలకు వెన్నెముక. బీసీ కులాలు లేని సమాజం, బీసీ కులాలు లేని భారతదేశాన్ని మనం ఊహించుకోలేం. భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలను కాపాడుతోంది బీసీ కులాలే. దేవాలయ ఆచార వ్యవహారాల్లో బీసీ కులాల తాలూకు వృత్తి నైపుణ్యాన్ని, హస్తకళలను భాగం చేయాలి, వారిని దేవాలయాల కార్యకలాపాలకు అనుసంధానం చేయాలి, తద్వారా వారిలో ఆర్థిక పరిపుష్టి కలిగించే అవకాశం ఉందని చాలామంది బీసీ మేధావులు చెప్పారు. దీన్ని కూడా అమలు చేయాలని చంద్రబాబు గారి దృష్టికి తీసుకెళుతున్నాను. వడ్డెరలు కాంట్రాక్టు వ్యవస్థల్లో నలిగిపోతున్నారు. వడ్డెరలు మైనింగ్ ప్రమాదాల్లో చనిపోతే కాంట్రాక్టర్లు మట్టి ఖర్చులు తప్ప ఇంకేమీ అండగా నిలిచే పరిస్థితి లేదు. నేను కర్నూలులో స్వయంగా ఈ పరిస్థితులు చూశాను.

అంతేకాదు, బీసీ యువత కులవృత్తులపై ఆధారపడి బతకలేని పరిస్థితి ఉంది. వీటన్నింటికి ప్రత్యామ్నాయాలను సమగ్రంగా ఆలోచించాల్సిన అవసరం ఉంది. వాడ బలిజ, అగ్నికుల క్షత్రియులు, జాలరి, పల్లెకారులు, పల్లెకాపు, గంగపుత్రులు, ముత్తరాసులు వంటి మత్స్యకార కులాలపై ప్రత్యేకమైన దృష్టిని సారించాలి. ‘సీఎం జగన్ పాలనలో 300 మంది బీసీ కార్మికులు ప్రాణాలు కోల్పోయారు. వారి సంక్షేమానికి రూ.75 వేల కోట్లు కేటాయిస్తామని మోసం చేశారు. ఇసుక రీచ్‌లు, క్వారీలను ఒక కంపెనీకి జగన్ కట్టబెట్టారని, బీసీలకు ఏటా రూ.15 వేల కోట్లు కేటాయిస్తామని మోసం చేశారని ధ్వజమెత్తారు. కార్పొరేషన్లను ప్రకటించి కుర్చీలు కూడా ఇవ్వలేదు. వారికిచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. తనకు అండగా నిలిచిన వారినే వంచించారు. జగన్ పాలనలో BCలకు రక్షణ కరువైంది’ అని పవన్ పేర్కొన్నారు.