జయహో బీసీ అందరి నినాదం – చంద్రబాబు

జయహో బీసీ అందరి నినాదమని.. అదే విధానం కావాలని , అన్ని వర్గాల సూచన మేరకు బీసీ డిక్లరేషన్‌ను ప్రకటించబోతున్నామని వెల్లడించారు చంద్రబాబు. గుంటూరు జిల్లా మంగళగిరిలో జయహో బీసీ పేరిట భారీ సభ నిర్వహించారు. ఈ సభకు టీడీపీ అధినేత చంద్రబాబు, జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ లతో పాటు ఇరు పార్టీల నేతలు హాజరయ్యారు. ఈ సందర్బంగా బీసీ డిక్లరేషన్‌ ను అధినేతలు ఆవిష్కరించారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టబోయే వివిధ అంశాలను ప్రస్తావిస్తూ బీసీ డిక్లరేషన్‌ రూపొందించారు. మొత్తం 10 అంశాలతో డిక్లరేషన్‌ ను సిద్ధం చేసారు.

ఇక ఈ సభలో బాబు మాట్లాడుతూ.. 40 ఏళ్లుగా బీసీలకు అండగా ఉన్న పార్టీ టీడీపీ. మిమ్మల్ని ఆదరించిన పార్టీ టిడిపి. ఒక్క మాటలో చెప్పాలంటే మీ డీఎన్ఏలోనే ఈ పార్టీ ఉంది. మీరు ఆ రుణం తీర్చుకోవాలి. మీకోసం పది సూత్రాలతో బీసీ డిక్లరేషన్ తీసుకువచ్చాం. ఈ ప్రభుత్వం పెన్షన్ ను దశలవారీగా పెంచింది… అదే 2019లో టీడీపీ వచ్చి ఉంటే అప్పుడే పెన్షన్ పెంచి ఉండేది. టీడీపీ-జనసేన ప్రభుత్వం రాగానే పెన్షన్ ను రూ.4 వేలు చేసే బాధ్యత తీసుకుంటాం. ఈ బీసీ డిక్లరేషన్ ఏమీ ఆషామాషీగా తీసుకురాలేదని , గత మూడేళ్లుగా 153 కులాలను 56 సాధికార కమిటీలుగా విభజించి, అన్ని ప్రాంతాల్లో 800 మీటింగులు పెట్టామని వెల్లడించారు. నాయకులతో, ప్రజాసంఘాలతో మాట్లాడామని, లోకేశ్ పాదయాత్రలో గమనించిన అంశాలను కూడా అధ్యయనం చేశామని చెప్పారు. చరిత్రను తిరగరాసే బీసీ డిక్లరేషన్ ను ఇవాళ మీ ముందుకు తీసుకువచ్చాం. మీ జీవితాల్లో ఒక వెలుగు వచ్చేట్టుగా ముందుకుపోతున్నాం. రాబోయే ఎన్నికల్లో టీడీపీ, జనసేన కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతోందని తెలిపారు. అదేవిధంగా బడుగు బలహీన వర్గాలకు ఎల్లప్పుడూ టిడిపి అండగా ఉంటుందని భరోసానిచ్చారు. జయహో బీసీ అందరి నినాదమని.. అదే విధానం కావాలని పిలుపునిచ్చారు.