కనికరం లేని పాషాణ ప్రభుత్వం ఇది అంటూ పవన్ ఫైర్

అంబులెన్స్ ఇవ్వకపోవడంతో బిడ్డ మృతదేహాన్ని స్కూటీపై 120 కిమీ తీసుకెళ్లిన ఘటన ఏపీలో చోటుచేసుకుంది. ఈ ఘటన ఫై జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేసారు. అల్లూరి జిల్లా కుమడ గ్రామానికి చెందిన దంపతుల బిడ్డ గురువారం విశాఖ కేజీహెచ్ లో మృతి చెందింది. హాస్పిటల్ నుంచి పాడేరుకు 120 కిలోమీటర్లు దూరం ఉంది. తమ చంటిబిడ్డను తరలించేందుకు అంబులెన్స్ కోసం ఎంతో సేపు ఎదురుచూసిన అందుబాటులోకి రాలేదు. అంబులెన్స్ కోసం కేజీహెచ్ సిబ్బందిని తల్లిదండ్రులు ప్రాధేయపడినా వారు ఏమాత్రం కనికరించకపోగా…దురుసుగా ప్రవర్తించారు. దీంతో చేసేదేమీ లేక స్కూటీపై 120 కిలోమీటర్లు ప్రయాణించి పాడేరకు తీసుకు వెళ్లారు ఆ తల్లిదండ్రులు.

దీనిపై జనసేన పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ్ తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. విశాఖలో అమానవీయ ఘటన చోటుచేసుకుందని తెలిపారు. చనిపోయిన బిడ్డను తరలించేందుకు అంబులెన్స్ ఇవ్వని పాషాణ ప్రభుత్వం ఇది అంటూ విమర్శించారు. బిడ్డ మృతదేహంతో 120 కిమీ బైకుపై వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడిందని విచారం వ్యక్తం చేశారు. ఆ గిరిజన దంపతులకు సీఎం జగన్ క్షమాపణ చెప్పాలని పవన్ కల్యాణ్ డిమాండ్ చేశారు.