తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపిన పవన్ కళ్యాణ్

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం‌ సందర్బంగా సినీ నటుడు , జనసేన అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. దేశంలో 29వ రాష్ట్రంగా ఆవిర్భవించిన తెలంగాణ, నేడు దేశానికే ఆదర్శంగా నిలిచి దశాబ్ది వేడుకలకు ముస్తాబైంది. ఈ సందర్భంగా జూన్‌ 2నుంచి 22వరకు దశాబ్ది ఉత్సవాలను ఘనంగా నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పించింది. ఇందులో భాగంగా పల్లె , పట్టణం అనే తేడా లేకుండా ప్రతి చోట దశాబ్ది ఉత్సవాల సంబరాలు కొనసాగుతున్నాయి.

తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ జనసేన అధినేత పవన్ కల్యాణ్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా.. నేటి నుంచి 22వ తేదీ వరకు సాగే ఈ దశాబ్ది ఉత్సవాలు చరిత్రాత్మకమైనవని, ఎందరో పోరాట యోధుల ప్రాణ త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావించిందని పేర్కొన్నారు. పేదరికం లేని తెలంగాణా ఆవిష్కృతం కావాలనీ, రైతులు, కర్షకులు, కార్మికులతోపాటు.. ఈ నేలపై జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం సాగించాలని కోరుకుంటున్నట్లు ప్రకటించారు.

‘‘తెలంగాణ కీర్తి అజరామరం. తెలంగాణ రాష్ట్ర అవతరణ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా తెలంగాణ వాసులందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు. నేటి నుంచి 22వ తేదీ వరకు సాగే ఈ దశాబ్ది ఉత్సవాలు చరిత్రాత్మకమైనవి. ఎందరో పోరాట యోధుల ప్రాణ త్యాగ ఫలితమే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం. అటువంటి త్యాగధనులందరికీ నివాళులు అర్పిస్తున్నాను. పేదరికం లేని తెలంగాణా ఆవిష్కృతం కావాలనీ, రైతులు, కర్షకులు, కార్మికులతోపాటు.. ఈ నేలపై జీవిస్తున్న ప్రతి ఒక్కరూ ఆనందకరమైన జీవితం సాగించాలని కాంక్షిస్తూ.. తెలంగాణ ఖ్యాతి, కీర్తి అజరామరంగా భాసిల్లాలని కోరుకుంటున్నాను’’ అంటూ జనసేన పార్టీ తన ట్విట్టర్ ఖాతా ద్వారా షేర్ చేసింది.