నేడు శ్రీవారి అంగప్రదక్షిణం టోకెన్ల విడుదల

సంప్రదాయ దుస్తులు ధరిస్తేనే అంగప్రదక్షిణకు అనుమతి

ttd-to-release-srivari-angapradakshinam-tokens-today

తిరుమలః ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు శ్రీవారి అంగప్రదక్షిణం కోటా టోకెన్లను విడుదల చేయనున్నట్టు తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) తెలిపింది. అలాగే, బాలాలయం కారణంగా ఫిబ్రవరి 22 నుంచి 28 వరకు అంగప్రదక్షిణ టోకెన్ల జారీని నిలిపివేసినట్టు పేర్కొంది. కాబట్టి భక్తులు ఈ విషయాన్ని గమనించి టోకెన్లు బుక్ చేసుకోవాలని కోరింది.

అంగప్రదక్షిణం టికెట్లు బుక్ చేసుకున్న భక్తులు అర్ధరాత్రి 12 గంటల సమయంలో శ్రీవారి పుష్కరిణిలో స్నానం చేసి తడిబట్టలతోనే వైకుంఠం మొదటి క్యూ కాంప్లెక్స్‌లోని క్యూ వద్దకు చేరుకోవాలి. అక్కడ టికెట్, ఐడీని చెక్ చేసిన అనంతరం భక్తులను ఆలయం లోపలికి అనుమతిస్తారు. స్త్రీ పురుషులకు వేర్వేరు వెయిటింగ్ హాళ్లలోకి ప్రవేశం ఉంటుంది. శ్రీవారికి సుప్రభాత సేవ మొదలైన తర్వాత భక్తులను అంగప్రదక్షిణానికి అనుమతినిస్తారు. 2.45 గంటలకు తొలుత స్త్రీలను, ఆ తర్వాత పురుషులను అంగప్రదక్షిణానికి పంపుతారు. అంగప్రదక్షిణ పూర్తి చేసిన మహిళలు వెండి వాకిలి వద్దకు చేరుకున్నాక పురుషులను అనుమతిస్తారు.

అంగప్రదక్షిణ చేసే భక్తులు తప్పనిసరిగా సంప్రదాయ దుస్తులు ధరించాల్సి ఉంటుంది. పురుషులు పంచె, పైన కండువా, స్త్రీలు చీర, లంగా వోణీ వంటివి ధరించాలి. మిగతా ఎలాంటి దుస్తులు ధరించినా అనుమతించరు. అంగప్రదక్షిణ అనంతరం భక్తులకు ఉచితంగా లడ్డూ ప్రసాదం అందిస్తారు.

తాజా తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండిః https://www.vaartha.com/category/telangana/