భారీ వర్షాలు..అమరనాథ్ యాత్రకు తాత్కాలిక విరామం

Amarnath Yatra temporarily suspended due to bad weather

శ్రీనగర్‌: గత రాత్రి నుంచి జమ్ముకశ్మీర్‌లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల వరదలు పోటెత్తాయి. దాంతో అమరనాథ్ యాత్రకు శుక్రవారం తాత్కాలిక బ్రేక్ పడింది. భారీ వర్షాలు కురుస్తుండటంతో బల్తాల్, పహల్గాం రెండు మార్గాల్లోనూ యాత్రను నిలిపివేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇంత భారీ వర్షంలో పవిత్ర అమరనాథ్‌ గుహలోకి యాత్రికులు వెళ్లడం కష్టమన్నారు. అందుకే 3,200 మంది యాత్రికులను నున్వాన్ పహల్గామ్ క్యాంపు దగ్గర, 4,000 మంది యాత్రికులను బల్తాల్ క్యాంపు దగ్గర నిలిపివేశామని చెప్పారు. వాతావరణ పరిస్థితులు అనుకూలించిన తర్వాత యాత్రను పునఃప్రారంభిస్తామని అధికారులు వెల్లడించారు. కాగా, ఈ ఏడాది ఇప్పటి వరకు 80 వేల మంది భక్తులు అమరనాథ్‌ యాత్రను పూర్తి చేసుకున్నారు.

అయితే, జమ్ముకశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. ఈ నెల 8, 9 తేదీల్లో కూడా కశ్మీర్‌లోని పలు ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. కాగా, 8వ బ్యాచ్‌కు చెందిన 7,010 మంది యాత్రికులు శుక్రవారం బఘ్‌వతి నగర్ బేస్ క్యాంపు నుంచి 247 వాహనాల్లో జమ్ము నుంచి కశ్మీర్ లోయకు బయలుదేరారు.