పంతానికి దిగితే నా సినిమాలు ఉచితంగా ఆడిస్తా- వైసీపీ నేతలకు పవన్ హెచ్చరిక

స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన దీక్షను విరమించిన పవన్ కల్యాణ్.. వైసీపీ నేతలపై మండిపడ్డారు. వైసీపీ నేతలు తమకు శత్రువులు కాదని.. వారి విధానాలనే వ్యతిరేకిస్తున్నామన్నారు. పోరాడి తెచ్చుకున్న ప్లాంట్‌ను ఎలా ప్రైవేటీకరిస్తారని ప్రశ్నించారు. స్టీల్‌ప్లాంట్ అనేది ఒక పరిశ్రమ మాత్రమే కాదని అది పోరాటాలకు, త్యాగాలకు గుర్తు అని చెప్పుకొచ్చారు.

స్టీల్ ప్లాంట్‌ ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని కోరుతూ అఖిలపక్షాన్ని ఏపీ ప్రభుత్వం ఢిల్లీ తీసుకెళ్లాలని డిమాండ్ చేశారు. పదవులు ఆశించకుండా సేవలు చేస్తేనే ప్రజలు ఆదరిస్తారన్నారు. తాము ప్రజాక్షేమం కోరుకునేవాళ్లమన్నారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజలకు అండగా ఉంటామన్నారు. ప్రభుత్వ పాలసీలు బాగోలేనప్పుడు ఖచ్చితంగా మాట్లాడతామని తెగేసి చెప్పారు జనసేనాని పవన్.

” మా ప్రభుత్వం రావాలని ప్రజలు కోరుకుంటే వాళ్ల తరఫున నిలబడతాం. లేదంటే ఆ తర్వాత జరిగే వాటికి నేను ఏమి చేయలేను. నా సినిమాలను ఆపేసి దెబ్బ కొట్టాలని వైసీపీ నేతలు చూశారు. నా సినిమాలను ఆపితే నేను భయపడను. పంతానికి దిగితే నా సినిమాలు ఉచితంగా ఆడిస్తా” అంటూ పవన్ కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు చేశారు.