ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ హెచ్చరిక

ఏపీ ప్రజలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీచేసింది. రాష్ట్ర వ్యాప్తంగా పలు జిల్లాల్లో భారీ వర్షం కురిసే అవకాశం ఉందని..ఆయా ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వర్షం నేపథ్యంలో అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వాయువ్య బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కొనసాగుతోంది. ఈ అల్పపీడనం అనుబంధంగా 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవిరించి ఉన్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. మరో రెండు రోజుల్లో దక్షిణ జార్ఖండ్, ఉత్తర ఒడిస్సా మీదుగా పశ్చిమ వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉంది. అయితే, దీని ప్రభావంతో ఏపీలో రాగల మూడు రోజులపాటు వాతావరణంలో అనేక మార్పులు చోటు చేసుకుంటాయని అధికారులు తెలిపారు.

ముఖ్యంగా ఉత్తర కోస్తాంధ్రలో బుధవారం నాడు చాలా చోట్ల వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ప్రధానంగా అల్లూరి సీతారామరాజు జిల్లా పార్వతీపురం మన్యం శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. ఇక దక్షిణ కోస్తాంధ్రాలోనూ భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. కొన్నిచోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడతాయని తెలిపారు. రాయలసీమలోనే దాదాపుగా ఇదే పరిస్థితి ఉంటుందని వాతావరణ శాఖ పేర్కొంది.