ఉగాది వేడుకల్లో పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఉగాది వేడుకల్లో పాల్గొన్నారు. కాకినాడ జిల్లా గొల్లప్రోలు మండలం చేబ్రోలు పవన్ కళ్యాణ్ నూతన గృహ ప్రవేశం చేసారు. ఈ సందర్బంగా నూతన ఇంట్లో ఉగాది వేడుకలు జరిపారు. పిఠాపురం అసెంబ్లీ నియోజవర్గం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీచేస్తున్న పవన్ కళ్యాణ్..తాజాగా గొల్లప్రోలు బైపాస్‌లోని పార్టీ కార్యకర్తకు చెందిన భవనంలో గృహప్రవేశ కార్యక్రమం నిర్వహించారు. అనంతరం ఇక్కడే పూజలు నిర్వహించి, ఉగాది వేడుకలు, పంచాగ శ్రవణ కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ పాల్గొన్నారు.

ఈ సందర్బంగా పవన్ మాట్లాడుతూ.. రాష్ట్రంలో రైతులంతా క్షేమంగా ఉండాలని ఆకాంక్షించారు. ఉద్యోగస్తులకు నెలకు సక్రమంగా జీతాలు రావాలని, రైతులు, రైతు కూలీలకు ఉపాధి అవకాశాలు పెరగాలని, పండించిన పంటకు మంచి ధర రావాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. ఏపీలో కూటమి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తామని విశ్వాసం వ్యక్తం చేశారు. తప్పకుండా కూటమి విజయకేతనం ఎగరవేస్తుందన్నారు. అమ్మవారి ఆశీస్సులతో పిఠాపురంలో పోటీ చేయడానికి వచ్చానని పవన్ కళ్యాణ్ తెలిపారు.