కాపులు తన వెన్నంటి నిలిస్తే తప్పకుండా అధికారం సాధిస్తాం – పవన్ కళ్యాణ్

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వరుస భేటీలతో బిజీ బిజీ గా ఉన్నారు. నిన్న బీసీ నేతలతో సమావేశమైన పవన్..నేడు కాపు సంక్షేమ సేనతో భేటీ అయ్యారు. ఈ సమావేశంలో కాపు సంక్షేమ సేన తరపున హరిహార జోగయ్య పాల్గొన్నారు. అలానే జనసేన పొలిటికల్ ఓఫైర్స్ కమిటీ చైర్మెన్ నాదెండ్ల మనోహర్, తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ.. కాపుల దగ్గర అంత ఆర్ధిక బలం లేదన్నారు.. కాపుల్లో సంఖ్యా బలం వున్నా ఐక్యత లేదన్నారు. సమాజంలో కులాలను విడదీసే మనుషులు ఎక్కువని పవన్ పేర్కొన్నారు. ఐక్యత ఉంటేనే రాజ్యాధికారం సాధ్యమని.. సంఖ్యాబలం ఉంటే అధికారం పంచుకోకతప్పదని అర్ధం కావాలంటూ పవన్ సంచలన వ్యాఖ్యలు చేశారు. అందరూ తనను కాపు, కాపు అంటారని… కానీ కాపులే తనను కాపుగా గుర్తించడంలేదని ఆవేదన వ్యక్తం చేశారు. కాపులు తన వెంట నిలబడడంలేదని విచారం వ్యక్తం చేశారు. కాపులు తన వెన్నంటి నిలిస్తే తప్పకుండా అధికారం సాధిస్తామని ధీమా వ్యక్తం చేశారు.

“నా సొంత సంపాదనతో పార్టీని నడుపుతున్నాను. నేను ఏనాడూ విరాళాలు ఇవ్వండి అని అడగలేదు. కొందరు స్వచ్ఛందంగా విరాళాలు ఇస్తున్నారు. తద్వారా అండగా నిలుస్తున్నారు. నిన్న బీసీ వర్గాల వారు సూచించిన అంశాలు నేడు కాపు సంక్షేమ సేన వారి ముందు ఉంచుతాను. వాటిపై కాపు నేతలు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలి. నేను పదేళ్లుగా పోరాడుతున్నాను. మీరు కూడా నాతో కలిసి నిలబడండి… మరో పదేళ్లలో మీరే నాయకులు అవుతారు.

కాపుల ఒక్కరి వల్లే అధికారం వస్తుందని చెప్పడంలేదు… కానీ కాపులు ఐక్యంగా నిలబడి ఇతర వర్గాలను కూడా కలుపుకుని పోతే కచ్చితంగా అధికారం సాధించగలం. నాయకులు మీలోంచే అవతరిస్తారు. కాపులు కేవలం గోదావరి జిల్లాలకే పరిమితం కారు… తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లోనూ ఉన్నారు. కాపులు అందరూ కలిసి ఉంటే దక్షిణ భారతదేశంలో అతిపెద్ద సమాజంగా కాపు సమాజం ఉద్భవిస్తుంది. నాయకుడు బతికి ఉన్నప్పుడు ఆయనకు అండగా నిలబడాలి. ఆ నాయకుడి వెంట నడవాలి… అప్పుడే బాగుపడతాం. ఈ విషయాన్ని కాపు సమాజం గ్రహించాలి” అని పిలుపునిచ్చారు. సరిగ్గా సినిమాలు చేస్తే రోజుకు రూ.2 కోట్లు సంపాదించే సత్తా తనకు ఉందని పవన్ స్పష్టం చేశారు. ఏపీ రాజకీయాల్లో కాపులు పెద్దన్న పాత్ర పోషించాలని పవన్ ఆకాంక్షించారు. ఏ పార్టీ ఎజెండాల కోసం తాను పనిచేయడం లేదన్నారు. ఒకరేమో రూ.1000 కోట్లతో తాను డీల్ కుదుర్చుకున్నారంటూ వ్యాఖ్యానిస్తున్నారని ఆయన ఫైర్ అయ్యారు.