క‌విత‌పై బండి వ్యాఖ్య‌లు స‌రైన‌వి కావు – బీజేపీ ఎంపీ అరవింద్

బిఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత ఫై బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సరైనవి కావన్నారు బీజేపీ ఎంపీ అరవింద్. కవితపై బండి సంజయ్ వ్యాఖ్యలను తాను సమర్థించబోనని స్పష్టం చేశారు. బండి సంజయ్ వ్యాఖ్యలు ఆయన వ్యక్తిగతం అని, ఆ వ్యాఖ్యలను బండి సంజయ్ ఉపసంహరించుకోవాలని అరవింద్ పేర్కొన్నారు. అధ్యక్ష పదవి పవర్ సెంటర్ కాదని, కోఆర్డినేషన్ సెంటర్ అని స్పష్టం చేశారు.

తెలంగాణ సంస్కృతిలో అనేక సామెతలు ఉంటాయని, సామెతలు ఉపయోగించేటప్పుడు జాగ్రత్తగా ఉపయోగించాలని బండి సంజయ్ కి హితవు పలికారు. బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు ప్రత్యర్థులకు ఆయుధాలుగా మారాయని, ఆయనే సంజాయిషీ ఇచ్చుకోవాల్సిన పరిస్థితి ఏర్పడిందని అన్నారు. అలాగే ఎమ్మెల్సీ కవితను లిక్కర్ స్కాంలో ఈడీ విచారణకు పిలవగానే తెలంగాణ ప్రభుత్వం ఉలిక్కిపడిందని, అందరూ వచ్చి ఢిల్లీలో మకాం వేశారని అరవింద్ ఎద్దేవా చేశారు. ఈడీ విచారణలో కవిత సహకరించలేదని తెలిసిందని , ఈడీ అధికారులు అడిగిన ప్రశ్నలకు సరైన సమాదానాలు కవిత చెప్పలేదని తెలిపారు. ఈడీ విచారణకు సహకరించక పోతే త్వరగా అరెస్ట్ చేస్తారని అరవింద్ జోస్యం చేప్పారు. కవిత తప్పు చేసినందుకే బీఆర్‌ఎస్ నాయకులు టెన్షన్ పడుతున్నారని విమర్శించారు.