వాయిద్య కారుడు కిన్నెర మొగిలయ్యకు పవన్ రూ.2 లక్షల ఆర్ధిక సాయం

కిన్నెర వాద్య కళాకారుడు దర్శనం మొగులయ్య పేరు ఒక్కసారిగా తెలుగు రాష్ట్రాల్లో మారుమోగిపోతుంది. దీనికి కారణం పవన్ కళ్యాణ్. పవన్ కళ్యాణ్ నటిస్తున్న భీమ్లా నాయక్ మూవీ తాలూకా టైటిల్ సాంగ్ ను థమన్ మొగులయ్య తో పాడించారు. ఈ పాటలో ఏడు మెట్ల కిన్నెర వాయిద్యాన్ని వాయిస్తూ బీమ్లా నాయక్ పుట్టుపూర్వోత్తరాలు చెబుతూ మొగులయ్య ప్రోమో లో కనిపించాడు. దీంతో మొగులయ్య గురించి అంత ఆరా తీస్తున్నారు. ఇదిలా ఉంటె కిన్నెర మొగిలయ్యకు పవన్ కళ్యాణ్ రూ. 2 లక్షల ఆర్థిక సాయాన్ని ప్రకటించారు. పవన్‌ కళ్యాణ్‌ లెర్నింగ్‌ ఫర్‌ హ్యూమన్‌ ఎక్సిలెన్స్‌ ద్వారా ఈ సాయాన్ని రిలీజ్‌ చేశారు.

త్వరలోనే ఇందుకు సంబంధించిన చెక్కును మొగులయ్యకు అందజేస్తారని జనసేన అధ్యక్షులకు రాజకీయ కార్యదర్శి పి.హరిప్రసాద్ తెలిపారు. తెలంగాణలోని అమ్రాబాద్ రిజ్వర్ ఫారెస్టు ప్రాంతానికి చెందిన మొగులయ్య 12 మెట్ల కిన్నెరపై స్వరాలు పలికిస్తూ గానం చేసే అరుదైన కళాకారుడు అని కొనియాడారు. వర్తమాన సమాజంలో కనుమరుగవుతున్న ఇలాంటి కళలు, ముఖ్యంగా జానపద కళారూపాలను యువతకు పరిచయం చేయాలనే తపన పవన్ కళ్యాణ్ లో ఉందన్నారు. మొగులయ్య కిన్నెర మీటుతూ పలు జానపద కథలను పాటల రూపంలో వినిపిస్తారని తెలిపారు.

సెప్టెంబర్ 2న పవర్‌స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు సందర్భంగా ‘భీమ్లా నాయక్’ సినిమా ఫస్ట్ సాంగ్‌ రిలీజ్ చేశారు. యంగ్ మ్యూజిక్ సెన్సేషన్ థమన్ ట్యూన్ కంపోజ్ చెయ్యగా.. ‘భీమ్లా నాయక్’ క్యారెక్టరైజేషన్‌ని ఎలివేట్ చేస్తూ రామజోగయ్య శాస్త్రి రాసిన లిరిక్స్ గూస్ బంప్స్ తెప్పిస్తున్నాయి. థమన్, శ్రీకృష్ణ, పృథ్వీ చంద్ర, రామ్ మిర్యాల నలుగురూ కలిసి ఈ పాట పాడారు.