ముగిసిన జీ20 సమావేశాలు..నేటి ప్రపంచ వాస్తవికతకు అనుగుణంగా మార్పులు ఉండాలిః ప్రధాని మోడీ

కూటమి తదుపరి అధ్యక్ష బాధ్యతలు బ్రెజిల్‌కు అప్పగింత

G-20 Summit concludes.. PM Modi calls for virtual review meet in November

న్యూఢిల్లీః భారత్‌ అధ్యక్షతన ఢిల్లీలో రెండు రోజులుగా జరిగిన జీ20 దేశాల శిఖరాగ్ర సమావేశాలు ఆదివారం సాయంత్రంతో ముగిశాయి. ఈ సందర్భంగా అంతకు ముందు ‘వన్‌ ఫ్యూచర్‌’ సెషన్‌లో మోడీ మాట్లాడుతూ.. ఐరాస భద్రతా మండలిని సంస్కరించాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పారు. ఐరాస ఏర్పడినప్పుడు, ఇప్పటితో పోలిస్తే అప్పటి ప్రపంచ పరిస్థితులు వేరని, ఆ సమయంలో సభ్య దేశాలు 51 మాత్రమే ఉన్నాయని తెలిపారు. అయితే నేడు ఐక్యరాజ్యసమితిలో సభ్యదేశాల సంఖ్య దాదాపు 200కు చేరువైందని, అయితే యూఎన్‌ఎస్‌సీలో శాశ్వత సభ్య దేశాల సంఖ్య మాత్రం మారలేదని అభిప్రాయపడ్డారు. రవాణా, కమ్యూనికేషన్‌, ఆరోగ్యం, విద్య.. ఇలా అన్ని రంగాల్లో మార్పులు వచ్చాయని, ఇందుకు అనుగుణంగా మన కొత్త ప్రపంచ నిర్మాణం కూడా ఉండాలని, ఆ దిశగా తక్షణ నిర్ణయాలు ఉండాలని మోదీ పేర్కొన్నారు.

నేటి పరిస్థితులకు అనుగుణంగా ఐక్యరాజ్యసమితితో పాటు అన్ని అంతర్జాతీయ సంస్థలను సంస్కరించాల్సిందేనని ప్రధాని మోడీ నొక్కిచెప్పారు. ప్రధానంగా ఐరాస భద్రతా మండలి(యూఎన్‌ఎస్‌సీ)ని విస్తరించాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. ఐరాసలో సభ్యదేశాల సంఖ్య పెరుగుతున్నప్పటికీ.. భద్రతా మండలిలో మాత్రం సభ్య దేశాల సంఖ్య మారడం లేదని అన్నారు. ప్రపంచాన్ని మరింత మెరుగైన భవిష్యత్తు దిశగా నడిపించేందుకు నేటి ప్రపంచ వాస్తవికత పరిస్థితులకు అనుగుణంగా మార్పులు ఉండాలని అభిప్రాయపడ్డారు.

జీ20 గ్రూపు తదుపరి అధ్యక్ష బాధ్యతలను బ్రెజిల్‌ అధ్యక్షుడు లూలా డాసిల్వాకు ప్రధాని మోడీ అప్పగించారు. దీనికి గుర్తుగా చిన్న సుత్తి వంటి గవెల్‌ను ఆయన చేతికి అందజేశారు. ఈ సందర్భంగా డాసిల్వా మాట్లాడుతూ వర్థమాన దేశాల ప్రయోజనాలకు సంబంధించిన అంశాలపై మాట్లాడేందుకు అవకాశం ఇచ్చిన భారత్‌ను ప్రశంసించారు. జీ20 సదస్సు ముగింపు నేపథ్యంలో అన్ని దేశాల అధినేతలు భారత జాతిపిత మహాత్మాగాంధీకి నివాళులర్పించారు. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌, బ్రిటన్‌ ప్రధాని రిషి సునాక్‌ తదితర నేతలు రాజ్‌ఘాట్‌కు వెళ్లి గాంధీ స్మారకం వద్ద కొంతసేపు మౌనం పాటించారు. వీరిని ప్రధాని మోడీ అక్కడకు తోడ్కొని వెళ్లారు.

కాగా, సైబర్‌ భద్రత, క్రిప్టో కరెన్సీలు వంటి కీలక సమస్యలు నేటి, భవిష్యత్తు ప్రపంచాన్ని ప్రభావితం చేస్తున్నాయని మోడీ అన్నారు. క్రిప్టోను నియంత్రించేందుకు అంతర్జాతీయ ప్రమాణాలు తీసుకురావాల్సిన అవసరం ఉన్నదని అభిప్రాయపడ్డారు. టెర్రరిజం ఫండింగ్‌కు సైబర్‌ స్పేస్‌ కొత్త వనరుగా ఆవిర్భవించిందని, దీన్ని అరికట్టేందుకు సమన్వయంతో పనిచేయాలని అన్నారు. కాగా, జీ20 సదస్సులో తీసుకొన్న నిర్ణయాలు, తీర్మానాలపై సమీక్ష చేసేందుకు ఈ ఏడాది నవంబర్‌లో వర్చువల్‌గా సమీక్ష సమావేశం నిర్వహణను మోడీ సదస్సు ముగింపు ప్రసంగం సందర్భంగా ప్రతిపాదించారు. భారత్‌కు జీ20 అధ్యక్ష బాధ్యతలు అధికారికంగా నవంబర్‌ 30 వరకు కొనసాగుతాయన్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తుచేశారు.