అక్కడ 6 నెలల తర్వాత తొలి కరోనా మరణం

వెల్లింగ్టన్: ఆరు నెలల తర్వాత న్యూజిలాండ్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. ఆ దేశ ఆరోగ్య అధికారులు శనివారం ఈ విషయాన్ని ధ్రువీకరించారు. 90 ఏండ్ల మహిళ కరోనా సంబంధిత అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నదని తెలిపారు. వెంటిలేటర్ లేదా ఇంటెన్సివ్ కేర్ వ్యవస్థపై ఆమె లేకపోయినా శుక్రవారం రాత్రి ఆక్లాండ్ ఆసుపత్రిలో మరణించినట్లు చెప్పారు. న్యూజిలాండ్‌లో కోవిడ్ -19తో చనిపోయిన 27వ వ్యక్తి ఆ మహిళ అని, ఈ ఏడాది ఫిబ్రవరి 16 తర్వాత నమోదైన తొలి కరోనా మరణమని ఆరోగ్య అధికారులు పేర్కొన్నారు.

కాగా, ఈ కరోనా మరణం చాలా బాధాకరమైనదని న్యూజిలాండ్‌ ప్రధాన మంత్రి జసిండా ఆర్డెర్న్ ఆవేదన వ్యక్తం చేశారు. కరోనా నియంత్రణకు ప్రస్తుతం మనం తీసుకుంటున్న చర్యలు ఎందుకు ముఖ్యమైనవో అన్నది ఇది గుర్తు చేస్తున్నదని తెలిపారు.

తాజా క్రీడా వార్తల కోసం క్లిక్ చేయండి : https://www.vaartha.com/news/sports/